- కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు
- బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్న సర్కారు
- గత సోమవారం సాయం ప్రకటన చేసిన సీఎం రేవంత్
- 5 రోజులు సర్వే.. 2 రోజులు ప్రభుత్వ సెలవులతో ఆలస్యం
ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో వరద ముంపునకు గురైన బాధితులకు సోమవారం సాయంత్రం తక్షణ సాయం అందనున్నది. ప్రతి కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నారు. ఖమ్మం నగరంలోని కరుణగిరి, బొక్కలగడ్డ వరద ముంపు ప్రాంతాల్లో గత సోమవారం పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో వేర్వేరు టీమ్స్‌ను ఏర్పాటు చేసి, ముంపు ప్రాంతాల్లో హౌస్ హోల్డ్ సర్వే నిర్వహించారు.
ఐదు రోజుల పాటు సర్వే, శనివారం వినాయక చవితి, తర్వాత ఆదివారం .. వరుసగా రెండ్రోజులు ప్రభుత్వ సెలవులు కావడంతో బాధితుల అకౌంట్లలో డబ్బులు జమ కాలేదు. వరదల కారణంగా పాక్షికంగా డ్యామేజీ అయిన ఇండ్లు, గుడిసెలకు సంబంధించిన సర్వే పూర్తయిందని, పూర్తిగా కూలిపోయిన ఇండ్లకు సంబంధించిన సర్వే పూర్తి కావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 15,055 పక్కా ఇండ్లు, పశువుల కొట్టాలు డ్యామేజీ అయ్యాయని గుర్తించారు. మరో 146 గుడిసెలు దెబ్బతిన్నట్టు తేల్చారు. డ్యామేజీ అయిన పక్కా ఇండ్లకు రూ.6,500 చొప్పున, గుడిసెలకు రూ.8 వేల చొప్పున పరిహారం అందనున్నది. వీటన్నింటికి కలిపి రూ.9 ,90,25,500 బాధితులకు అకౌంట్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేయనున్నారు.
రూ.10 వేల లెక్క ఇది!
జిల్లాలో 15,055 పక్కా ఇండ్లు , 146 గుడిసెలకు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎక్స్ గ్రేషియాను అందించనున్నారు. ఇవే ఇండ్లకు సీఎం ప్రకటించిన రూ.10వేల తక్షణ సాయాన్ని కూడా వర్తింపజేస్తామని అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు పూర్తిగా కూలిపోయిన, కొట్టుకుపోయిన, ధ్వంసమైన ఇండ్ల లెక్క రాగానే వాటన్నింటికీ కలిపి రూ.10వేల చొప్పున బాధితుల అకౌంట్లకు జమచేస్తామని అంటున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సర్వే కంప్లీట్ కాకపోవడం వల్లనే తక్షణ సాయం ఆలస్యమైందని వివరిస్తున్నారు.
రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ఖమ్మం జిల్లాలోనే డ్యామేజీ అధికంగా ఉందని, అందువల్ల సర్వే టీమ్ ల సంఖ్య పెంచినప్పటికీ లెక్కింపు ఆలస్యమైందని చెబుతున్నారు. గతనెల 31న రాత్రి ఖమ్మంలో ఒక్కసారిగా మున్నేరు వరద ముంచుకొచ్చింది. ఈ నెల ఒకటో తేదీన తెల్లవారే సరికి మున్నేరుకు రెండు వైపులా ఉన్న దాదాపు 50 కాలనీలతోపాటు పాలేరు, మధిర నియోజకవర్గంలో పలు గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి.