హనుమకొండ సిటీ, వెలుగు: ట్రైసిటీ అభివృద్ధికి సరైన ప్రణాళిక రూపొందించుకుని ముందుకుసాగాలని ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్ణయించారు. సోమవారం కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ మీటింగ్ హాల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పలు అంశాలపై భద్రకాళి చెరువు పూడికతీత పనులను ఎండకాలంలోగా పూర్తి చేసి వానకాలంలో నీళ్లు నింపేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పూడికతీత ఖర్చు ప్రభుత్వమే భరించాలని నిర్ణయించారు. ట్రైసిటీలో ట్రాఫిక్ పెరుగుతున్నందున వరంగల్, హనుమకొండ, కాజీపేట నగరాల్లో 5 ప్రధానరోడ్లను విస్తరించాలని నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంజీఎం నుంచి పోలీసు హెడ్ క్వార్టర్స్ వరకు రోడ్డు విస్తరణ పనులు, హనుమకొండ హనుమాన్ దేవాలయం నుంచి అలంకార్ జంక్షన్ దాకా, కాంగ్రెస్ భవన్ నుంచి కేయూసీ రోడ్డు వరకు, అంబేద్కర్ జంక్షన్ నుంచి ఎన్జీవోస్ కాలనీ, కాజీపేట జంక్షన్ నుంచి సోమిడి వరకు ప్రధాన రోడ్లను విస్తరణ చేయాలని నిర్ణయించారు.
రోడ్లపై ఇబ్బందులు కలుగకుండా రూ.9.40 కోట్లతో నగరంలో చిరువ్యాపారుల సముదాయాలు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను నిర్మించాలని నిర్ణయించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లను సంక్రాంతికి అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. గతంలో నిర్మించిన ఇండ్లు కేటాయించకుండా ఉన్నాయని, వాటిని లబ్దిదారులకు అందేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.