గమ్యం గజిబిజి .. ప్యాసింజర్లను తిప్పలు పెడుతున్న ఆర్టీసీ యాప్

గమ్యం గజిబిజి .. ప్యాసింజర్లను తిప్పలు పెడుతున్న ఆర్టీసీ యాప్
  • బస్సుల రాకపోకల సమయాల్లో తేడాలు 
  •  అవి వచ్చే దాకా  ప్రయాణికుల ఎదురుచూపు 
  • ఆర్టీసీ యాప్ అప్ డేట్ లో  అధికారుల నిర్లక్ష్యం

హైదరాబాద్, వెలుగు : ప్రయాణికులకు జర్నీని మరింత సులభం చేసేందుకు తెచ్చిన టీజీఎస్ ఆర్టీసీ ‘గమ్యం’ గజిబిజిగా తయారైంది. యాప్ ను ఎప్పటికప్పుడు అప్​డేట్​చేయకపోతుండగా ప్రయాణికులకు అందుబాటులో లేదు. ఎక్కాల్సిన బస్సు ఏ సమయానికి వస్తుంది.. ఎప్పటిలోపు చేరుకోవచ్చనే వివరాలతో  ఎనిమిది నెలల కిందట యాప్​ను అధికారులు అందుబాటులోకి తెచ్చారు.  మొదట్లో రెండు, మూడు నెలలు బాగానే పనిచేసింది. కానీ.. అప్​డేట్​చేయడంలో ఆర్టీసీ ఐటీ అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దీంతో యాప్​ఓపెన్​చేసి చూస్తే బస్సుల వివరాలు, రాకపోకలకు సమయాలకు పోలిక ఉండట్లేదు. కొద్దిరోజుల కిందట ఉప్పల్ నుంచి తొర్రూర్​వెళ్లేందుకు ఒక ప్రయాణికుడు గమ్యం యాప్​లో బస్సు వివరాలు వెతికాడు.  యాప్ లో చూపిన బస్సు సమయానికి రాలేదు.. దాదాపు గంట తర్వాత రావడంతో అప్పటిదాకా ఎదురు చూసినట్టు చెప్పాడు. ఇతర దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవుతున్నట్టు పేర్కొంటున్నారు. 

బస్సుల సమయాలను తెలిపేందుకు  

రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్ఆర్టీసీ బస్సుల రాకపోకల సమయాలను, ఏ నంబర్ బస్సు ఏ ప్రాంతంలో ఉంది.  ఏ సమయానికి బస్ స్టేషన్​కు వస్తుందనే వివరాలను గమ్యం యాప్​లో చూడొచ్చు. బస్సులను ట్రాక్​చేసే ఫెసిలిటీ కూడా ఉంది. సిటీ బస్సులకు రూట్ నంబర్ ను ఎంటర్ చేసి ఎక్కడుందో తెలుసుకోవచ్చు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను టికెట్ రిజర్వేషన్ నంబర్ ఆధారంగా ట్రాకింగ్ చేయొచ్చు. సమీపంలోని బస్టాప్​లను తెలుసుకోవచ్చు. తద్వారా జర్నీ ప్లాన్ చేసుకోవచ్చు. అత్యాధునిక ఫీచర్లతోనూ రూపొందించారు. ప్రస్తుతం 4,170 ఆర్టీసీ బస్సులకు ట్రాకింగ్ ఫెసిలిటీ కల్పించినట్టు అధికారులు తెలిపారు. తాజాగా పల్లె వెలుగు బస్సుల వివరాలు కూడా యాప్ లో చేర్చినట్టు పేర్కొన్నారు. అందులో డ్రైవర్, కండక్టర్ వివరాలు కూడా ఉంటాయి.  హైదరాబాద్‌లోని పుష్పక్ ఎయిర్‌ పోర్ట్, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు కూడా ట్రాకింగ్ సదుపాయం అందుబాటులో ఉంది. కేవలం పుష్పక్​బస్సుల వివరాలు మాత్రమే యాప్​లో యాక్టీవ్ గా చూపుతున్నట్టు సమాచారం. మిగిలిన బస్సు సర్వీసుల సమయాలకు, వాస్తవంగా తిరిగే సమయాలకు మధ్య పొంతన ఉండడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.  

మహిళల భద్రతకు ‘ప్లాగ్​ ఏ బస్​’ ఫీచర్

మహిళా ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ అధికారులు తీసుకునే ప్రత్యేక చర్యల్లో భాగంగా రాత్రి 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు 'ప్లాగ్ ఏ బస్ ఫీచర్' పేరుతో యాప్ ను అందుబాటులోకి తెచ్చారు.  యాప్ ను లాగిన్ అయి కావాల్సిన వివరాలు నమోదు చేయగానే ఆటోమేటిక్ గా ఫోన్ స్క్రీన్ పై గ్రీన్ లైట్ కనిపిస్తుంది. అది బస్సు డ్రైవర్ వచ్చేటప్పుడు చూపితే వెంటనే ఆపుతారు. తద్వారా  మహిళలు సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే.. డయల్100,108కి కనెక్ట్ అయ్యేలా యాప్‌ను డిజైన్​ చేశారు. టీజీఎస్​​ఆర్టీసీ గమ్యం పేరుతోను గూగుల్ ప్లే స్టోర్‌,  టీజీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ నుంచి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అయితే అందులోనూ ఎలాంటి వివరాలు సరిగా ఉండడం లేదు. లాగిన్ అయ్యేటప్పుడు ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఉంది. కాగా.. యాప్‌ను ఎప్పటికప్పుడు అప్​డేట్​చేయక పోతుండగా.. ప్రయాణికులకు అందుబాటులో లేదనే వాదన వినిపిస్తుంది.