నిర్మల్ సెగ్మెంట్​లో 670 మంది డూప్లికేట్ ఓటర్లు

  •     కలెక్టర్ బదిలీకి ఇదే కారణమంటున్న రెవెన్యూ వర్గాలు

నిర్మల్, వెలుగు: నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు 670 మంది డూప్లికేట్ ఓటర్లు నమోదైనట్లు సంబంధిత శాఖ అధికారులు నిర్ధారించారు. నియోజకవర్గంలో దాదాపు 40 వేల మందిని బోగస్ ఓటర్లుగా నమోదు చేశారంటూ బీజేపీ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి తదితరులు ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్​కు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్​కు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. బోగస్ ఓటర్ల నమోదు వ్యవహారంలో కలెక్టర్ సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సీఈసీకి అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

దీంతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సీరియస్​గా స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు అధికారులు మొత్తం 40 వేల ఓటర్లపై విచారణ జరిపి.. వారిలో 704 మంది ఓటర్లు చనిపోయారని, 670 మంది మాత్రం డూప్లికేట్ ఓటర్లుగా నమోదైనట్లు నిర్ధారించారు. ఇక్కడి అధికారుల నివేదికపై ఎన్నికల సంఘం సీరియస్​గానే స్పందించినట్లు తెలుస్తోంది. దీని కారణంగానే కలెక్టర్ వరుణ్​రెడ్డిని ఆకస్మికంగా బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.