భూగర్భంలో ఉప్పు తెట్ట .. కలుషితమవుతున్న భూగర్భ జలాలు

భూగర్భంలో ఉప్పు తెట్ట .. కలుషితమవుతున్న భూగర్భ జలాలు
  • రసాయనిక ఎరువులు, క్రిమిసంహార మందులే కారణం 
  • పంటలపై దుష్పరిణామాలు
  • సాగుకు ఉపరితల నీరే శ్రేయస్సంటున్న అధికారులు
  • మొబైల్ ల్యాబ్ వెహికల్​తో రైతులకు అవగాహన

నిర్మల్, వెలుగు: భూగర్భ జలాలకు క్రమక్రమంగా ముప్పు ఏర్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రైతులు పంటల సాగుకు పెద్ద మొత్తంలో రసాయనిక ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తుండడంతో అవి భూగర్భంలోకి వెళ్లి నీటిని  విషపూరితం చేస్తున్నాయి. కడెం ప్రాజెక్టు పరిధిలో ఇప్పటికే రసాయనిక ఎరువుల వినియోగం కారణంగా భూగర్భ జలాలు విషపూరితమైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీనికి తోడు ఇటీవలే సంబంధిత శాఖ అధికారులు భూగర్భ జలాలను పరీక్షించగా నీరు విషపూరితమవుతున్నట్లు  తేలింది. 

పంటలకు కూడా పనికిరాకుండా..

నిర్మల్ జిల్లాలో దాదాపు 70 వేలకు పైగా వ్యవసాయ బోరు బావులున్నాయి. ఈ బోరు బావుల నుంచి వచ్చే నీటితోనే వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. అయితే పంటలు సాగులో రసానిక ఎరువులు, పెస్టిసైడ్స్ విపరీతంగా పెరిగిపోవడంతో అవి క్రమంగా భూగర్భంలోకి చేరి జలాలు విషపూరితమవుతున్నాయి. భూగర్భ నీరు సహజత్వాన్ని కోల్పోయి పూర్తిస్థాయిలో ఉప్పు నీటిగా మారిపోతోంది. జిల్లాలోని భూగర్భ జలాల్లో సెలెనిటీ (ఉప్పు తెట్టె) అత్యధికంగా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. 

దీనికితోడు భూగర్భ జలాల్లో నైట్రేట్ శాతం కూడా అత్యధికంగా ఉన్నట్లు తేలింది. కలుషితాలతో భూగర్భ జలాలు తాగడానికి పనిరాకుండాపోయాయి. కాగా ఆ నీటిని పంటలకు వినియోగిస్తే దిగుబడులు కూడా తగ్గిపోతాయని, అనేక రకాల తెగుళ్ల బారిన పడతాయని అధికారులు చెబుతున్నారు. రసాయనిక ఎరువులతో సాగు చేసిన పంట ఉత్పత్తులను తింటున్న మనుషులు సైతం రోగాల బారిన పడుతున్నారు.

విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు

భూగర్భ జలాల్లో ఉప్పుతెట్ట, నైట్రేట్ శాతం పెరిగిపోతున్న నేపథ్యంలో భూగర్భ జల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ ల్యాబ్ వెహికల్​లో గ్రామాల్లో పర్యటిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. వెహికల్​లోని లేబరేటరీలో రైతుల ముందే భూగర్భ జలాలను పరీక్షించి పరిస్థితిని వివరిస్తున్నారు. రసాయనిక ఎరువులు, పెస్టిసైడ్స్ వినియోగాన్ని క్రమంగా తగ్గించాలని సూచిస్తున్నారు. పంటల సాగుకు భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గిస్తూ ఉపరితల నీరైన చెరువులు, కాలువలు, వర్షపు నీరు, చెక్ డ్యామ్​ల నీటిని ఎక్కువగా వినియోగించాలని సూచిస్తున్నారు.

రైతులకు అవగాహన కల్పిస్తున్నం

భూగర్భ జలాల్లో విపరీతంగా పెరిగిపోతున్న ఉప్పు తెట్టె, నైట్రేట్​పై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఎంపిక చేసిన గ్రామాల్లో మొబైల్ ల్యాబ్ వెహికల్ తో పర్యటిస్తున్నం. రైతుల సమక్షంలోనే భూగర్భ నీటిని పరీక్షించి నీటిలో ఉన్న ఉప్పు తెట్టె, నైట్రేట్ తో పాటు ఇతర విషపూరిత కారకాలపై వివరిస్తున్నం. రైతులు రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని సూచిస్తున్నం. ఉపరితల నీటిని వినియోగించే విధానాలపై అవగాహన కల్పిస్తున్నం.

శ్రీనివాసరావు, డీడీ, భూగర్భ జల శాఖ, నిర్మల్ జిల్లా