న్యూఢిల్లీ, వెలుగు : ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)కి ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. ఈ నెల 13 పోలింగ్ రోజుతో పాటు 14, 15 తేదీల్లో రాష్ట్రంలోని పల్నాడు, నరసరావుపేట, తాడిపత్రి, అనంతపురం, చంద్రగిరి, మాచర్ల తదితర ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లను సీరియస్‌గా తీసుకున్న ఈసీ.. హింసాత్మక ఘటనలపై వివరణ ఇచ్చేందుకు తమ ముందు నేరుగా హాజరుకావాలని ఏపీ సీఎస్, డీజీపీలకు నోటీసులిచ్చింది.
ఇందులో భాగంగా గురువారం ఢిల్లీలోని నిర్వచన్ సదన్‌లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, మరో ఇద్దరు కమిషనర్ల ముందు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ గుప్తా హాజరయ్యారు. ఎన్నికల సమయంలో పోలీసు ఉన్నతాధికారులను మార్చడం వల్ల ఈ సమస్య వచ్చిందని వారు సమాధానమిచ్చినట్లు తెలిసింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన జిల్లా పోలీస్ అధికారులకు స్థానికంగా ఉన్న సమస్యాత్మక ప్రాంతాలపై అవగాహన లేదని, దీంతో అల్లర్లు వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు కంట్రోల్ చేయడంలో కొంత ఆలస్యమైనట్లు వివరించారు. ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు ప్రశాంతంగా మారాయని, హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు.
పల్నాడు, అనంతపురం ఎస్పీల సస్పెన్షన్
ఏపీలో అల్లర్లను కట్టడి చేయడంలో విఫలమైన అధికారులపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంది. మూడు జిల్లాల్లో 12 మంది, ఇతర పోలీసు అధికారులను సస్పెన్షన్ చేసింది. సీఎస్, డీజీపీలతో భేటీ అనంతరం ఈ మేరకు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేయగా, శాఖాపరమైన విచారణకు చేపట్టాలని సీఎస్, డీజీపీలను ఆదేశించింది. అలాగే పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు వారిపై విచారణ చేపట్టాలని పేర్కొంది. ఘర్షణలకు సంబంధించి అన్ని కేసులపై సిట్ ఏర్పాటు చేసి రెండ్రోజుల్లో యాక్షన్ టేకెన్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది.