నిల్చుని పనిచేయండి.. ఉద్యోగులకు పనిష్మెంట్.. సీఈవోకు నెటిజన్ల సపోర్ట్.. వీడియో వైరల్..

నిల్చుని పనిచేయండి.. ఉద్యోగులకు పనిష్మెంట్.. సీఈవోకు నెటిజన్ల సపోర్ట్.. వీడియో వైరల్..

ఢిల్లీ: నోయిడాలో సీఈవో ఉద్యోగులకు ఇచ్చిన పనిష్మెంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎవరి డెస్క్ ముందు వాళ్లు 30 నిమిషాల పాటు నిల్చునే ఉండాలని సదరు సీఈవో ఉద్యోగులకు పనిష్మెంట్ ఇచ్చాడు. ‘‘ఆలస్యంగా ఆఫీస్కు వెళ్లి ఉంటారేమో.. అందుకే సీఈవో ఇలా చేశాడేమో.. మరీ ఇంత కఠినంగా ఉండకూడదు..’’ లాంటి కన్క్లూజన్కు రాకండి. ఎందుకంటే.. సీఈవో ఉద్యోగులకు ఈ శిక్ష విధించడానికి ఒక బలమైన కారణం ఉంది. ఉద్యోగ ధర్మాన్ని మర్చిపోయి.. టైం పాస్ చేస్తూ.. వృద్ధ దంపతులను 50 నిమిషాల పాటు పట్టించుకోనందుకు సీఈవో ఈ శిక్ష విధించాడు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నోయిడా అథారిటీ ఆఫీస్కు ఎం.లోకేశ్ సీఈవోగా వ్యవహరిస్తున్నాడు. ఓ ఇంటికి సంబంధించిన విషయమై వయసు మీద పడిన భార్యాభర్తలు ఆఫీస్ కు వచ్చారు. డిసెంబర్ 16న ఈ వృద్ధ దంపతులు ఆఫీసుకు వెళ్లి తమ ఫైల్ ముందుకు కదిలేలా చూడాలని, తమ ఫైల్ను అఫ్రూవ్ చేయాలని మొరపెట్టుకున్నారు. దాదాపు 50 నిమిషాల పాటు రెసిడెన్షియల్ ప్లాట్ డిపార్ట్ మెంట్ లోని ప్రతీ ఉద్యోగి ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కానీ.. ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. దాదాపు 50 నిమిషాల పాటు అలానే ఈ వృద్ధ దంపతులు నిల్చుని పడిగాపులు కాశారు. ఈ విషయం నోయిడా అథారిటీ సీఈవో లోకేష్ దృష్టికెళ్లింది. ఉద్యోగులకు గుణపాఠం చెప్పాలని ఆయన భావించారు. 

Also Read :- బ్రతికున్న కోడిపిల్లను మింగి వ్యక్తి మృతి.. కోడిపిల్ల సజీవం

నిజ నిర్ధారణ కోసం ఈ ఘటన జరిగిన 20 నిమిషాల తర్వాత సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. ఆ వృద్ధ దంపతులు అంతసేపు నిరీక్షిస్తున్న దృశ్యాలు చూసి లోకేష్ గుండె తరుక్కుపోయింది. ఉద్యోగుల అలసత్వంపై, నిర్లక్ష్యంపై సీఈవో మండిపడ్డారు. రెసిడెన్షియల్ ప్లాట్ డిపార్ట్మెంట్లోని ప్రతీ ఉద్యోగి అర గంట పాటు వాళ్ల చైర్స్లో నుంచి లేచి నిల్చుని పనిచేయాలని కఠినమైన ఆదేశాలిచ్చారు. నోయిడా అథారిటీ ఆఫీస్లో ఉద్యోగులు నిల్చున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెజారిటీ నెటిజన్లు సీఈవో విధించిన శిక్ష సరైందనేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.