ఖమ్మం/ కల్లూరు, వెలుగు: జిల్లాలో ఈ యాసంగి సీజన్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారం గడిచినా, రైతులకు ప్రయోజనం లేకుండా పోయింది. గ్రామాల్లో పోటీ పడి ప్రజాప్రతినిధులు, అధికారులు కొబ్బరికాయలు కొట్టి సెంటర్లను ఓపెన్ చేశారు. కాంటాలు మాత్రం కావడం లేదు. ఇప్పటికీ ఒక్క బస్తా కూడా కొనలేదు. కొన్ని చోట్ల కాంటాలు వేసినా, మిల్లుల అలాట్ మెంట్ రాక బస్తాలను కేంద్రాల్లోనే ఉంచేశారు. రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోళ్లు జరగకపోవడంతో కొందరు రైతులు మళ్లీ దళారులనే ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.2060 వరకు ఉండగా, దళారులు మాత్రం రూ.1500 లకన్నా తక్కువకే కొంటున్నారు. రైతులు కొందరు ప్రైవేట్ వారికి అమ్ముకుని క్వింటాలుకు రూ.400 వరకు నష్టపోతున్నారు.
ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్న ఆఫీసర్లు
జిల్లాలో ఈసారి 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా 240 వరకు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్లాన్చేశారు. వారం క్రితం నుంచి కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. ఇప్పటికీ ఏ సెంటర్ నుంచి ధాన్యాన్ని ఏ మిల్లుకు తరలించాలో నిర్ణయించలేదు. ఇంతకు ముందు రెండు సీజన్లలో కొన్న ధాన్యమే చాలా నిల్వ ఉందని, ఇప్పుడు ధాన్యం కొంటే నిల్వ చేసేందుకు ప్లేస్లేదంటూ మిల్లర్లు ధాన్యం తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. జిల్లాలోని 65 రైస్ మిల్లుల్లో ఇప్పటికే 2 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం నిల్వ ఉందని మిల్లర్లు చెబుతున్నారు. బియ్యాన్ని ఎఫ్‌సీఐ అధికారులు సకాలంలో తీసుకోకనే ఈ పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. దీంతో తమ జిల్లాలోని ధాన్యాన్ని వేరే జిల్లాల్లో మిల్లులకు కేటాయించేందుకు అనుమతినివ్వాలంటూ రెవెన్యూ అధికారులు ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ చేశారు. ఈలోగా ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నారు. రైతు వేదికలు, ఫంక్షన్‌హాళ్లు, గవర్నమెంట్ స్కూళ్లు, ఖాళీ భవనాల్లో ధాన్యం నిల్వ చేసేందుకు ప్లాన్చేస్తున్నారు. కోవిడ్ కారణంగా ట్రాన్స్ పోర్ట్ చేసే అవకాశం లేక ప్రభుత్వ స్కూళ్లు, ఫంక్షన్‌హాళ్లలో రెండేళ్ల క్రితం మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన మక్కలను నిల్వ చేసి నష్టాలపాలైంది. ఇప్పుడు కూడా అదే నష్టం జరిగే ప్రమాదముందని ఆఫీసర్లే చెబుతున్నారు.
రైతుల్లో ఆందోళన...
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం అక్కడే పేరుకు పోతుండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అనుకోని విధంగా వాతావరణం మారి వడగండ్ల వాన వస్తే తమ పరిస్థితేంటి అని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొని తరలించాలని రైతులు కోరుతున్నారు. అధికారులు మాత్రం రైతులు ఆరబెట్టిన తర్వాత నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తేవాలని, ప్రభుత్వంతో చర్చించి ప్రత్యామ్మాయ ఏర్పాటు చేస్తామని అంటున్నారు.
ప్రస్తుత యాసంగి సీజన్ లో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈనెల13న కల్లూరు మండలం పుల్లయ్యబంజరులోని శివాలయం ఆవరణలో ప్రారంభించారు. అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ రావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కొబ్బరి కాయలు కొట్టారు. వారం గడిచినా ఒక్క గింజనూ కొనలేదు. దాదాపు 200 మందికి పైగా రైతుల ధాన్యం రెడీగా ఉంది. కొనుగోళ్లు ఆలస్యమవుతుండడంతో దళారుల మోసం ఇంకా పెరిగింది. ఏకంగా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే దళారులు కొంటున్నారు. గురువారం తూర్పు లోకారానికి చెందిన రాధాకృష్ణ అనే రైతుకు చెందిన 200 బస్తాల ధాన్యాన్ని బస్తా రూ.1120 చొప్పున కాంటా వేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ముందు 75 కేజీల ధాన్యం బస్తాను రూ.1250 ధరకు కొనుగోలు చేసిన దళారులు, ఇప్పుడు ప్రభుత్వ ఆలస్యాన్ని ఆసరాగా చేసుకుని రేటు మరింత తగ్గించేశారు.
వడ్లను జల్ది కొనాలె...
వడ్లను ఇక్కడికి తెచ్చి వారమైంది. ప్రైవేటోళ్లు వచ్చి ఇక్కడే కొంటున్నరు. బస్తా రూ.1170కు అడిగి, రెండ్రోజుల తర్వాత రూ.1120కు రేటు తగ్గించిన్రు. ఒకరు 30సంచులు, మరొకరు 40 సంచులు అమ్ముకున్నరు. నేను కూడా పైసలు అవసరం ఉండి30 సంచులను తక్కువ ధరకే అమ్మినా. సర్కారు కొంటే రేటు పెరుగుతుంది కదా అనుకుంటే, ఇంకా లేట్ చేస్తున్నరు. చెడగొట్టు వానలు పడితే నష్టపోతం.
-
బుర్రి లక్ష్మయ్య, రైతు, పుల్లయ్య బంజర