జగిత్యాల జిల్లా ధర్మపురి శాసనసభ నియోజకవర్గం ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్ ను తెలంగాణ హైకోర్టు అదేశాలతో అధికారులు తెరిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటనలో అవకతవకలు జరిగాయని, ఎమ్మెల్యేగా గెలిచిన కొప్పుల ఈశ్వర్ (ప్రస్తుతం మంత్రి) ఎన్నిక అక్రమమని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు తారుమరయ్యాయని.. రీ కౌంటింగ్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. 441 ఓట్ల తేడాతో తాను ఓటమిపాలు కావడంతో అవకతవకలు జరిగినట్టు ఆరోపించిన అడ్లూరి.. మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
అడ్లూరి పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ఫలితాలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను తెరిచి.. అప్పటి ఎన్నికకు సంబంధించిన 17A,17 C డాక్యుమెంట్ కాపీలను, సీసీ పుటేజీ, ఎన్నికల ప్రొసీడింగ్స్ ను ఏప్రిల్ 11వ తేదీన సమర్పించాలని రిటర్నింగ్ అధికారి భిక్షపతికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మీన్ భాషతో పాటు స్థానిక ఆర్డీవో, ఎమ్మార్వోలతో సుమారు 120 మంది ఆఫీసర్లు సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరిచారు. ఆ తర్వాత ప్రొసీడింగ్స్ ను హైకోర్టుకు పంపనున్నారు.
స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యాడు. కానీ, మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరుకాలేదు. కొప్పుల తరపున డీసీఎంఎస్ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రస్తుతం రీ కౌంటింగ్ ఆసక్తి రేపుతోంది. రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.