స్కీమ్​ల సర్వేను పకడ్బందీగా చేపట్టాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్/ఆదిలాబాద్​టౌన్/దండేపల్లి/కాగజ్ నగర్/నేరడిగొండ, వెలుగు: ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సర్వేను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. ఆసిఫాబాద్ మండలంలోని అంకుసాపూర్​లో జరుగుతున్న రైతు భరోసా, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియను గురువారం పరిశీలించారు. సర్వేను పారదర్శకంగా చేపట్టాలన్నారు. సాగుకు యోగ్యం కాని భూముల వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ నమోదు చేయొద్దని ఆదేశించారు. రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న వారి ఇంటింటికి వెళ్లి కుటుంబ వివరాలు నమోదు చేయాలన్నారు. తహసీల్దార్ రోహిత్ కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ భుజంగరావు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.

లబ్ధిదారుల జాబితాను రూపొందించాలి

ఆదిలాబాద్​ జిల్లా సిరికొండ మండలం రాయ్ గూడ, కొండాపూర్, పొన్న గ్రామాల్లో పర్యటించి అధికారులు చేస్తున్న సర్వేను కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు.  సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారుల జాబితాను పకడ్బందీగా రూపొందించాలన్నారు. గ్రామ సభల ద్వారా అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని సూచించారు. తహసీల్దార్ తుకారాం, డీఎల్పీవో ఫణీంద్ర, ఎంపీడీవో, ఏఈవో, ఏవో తదితరులు ఉన్నారు.

అర్హులైనవారికే సంక్షేమ పథకాలు అందాలి 

అర్హులైన లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు అందాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. దండేపల్లి మండలం ముత్యంపేట, చింతపల్లి, మేదరిపేటలో పర్యటించి సర్వే చేస్తున్న ఫీల్డ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. దండేపల్లి తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో జేఆర్.ప్రసాద్ తదితరులున్నారు. కాగజ్ నగర్ మండలం భట్టుపల్లిలో జరుగుతున్న ఇంటింటి సర్వేను కాగజ్​నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా పరిశీలించారు. రేషన్ కార్డుల జారీ కోసం, రైతు భరోసా కోసం చేస్తున్న సర్వేలో తప్పులు జరగకుండా చూడాలన్నారు.

సర్వే కోసం ఇచ్చిన జాబితా ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తహసీల్దార్ కిరణ్, ఎంపీడీవో రమేశ్ ఉన్నారు. నేరడిగొండ మండలంలోని శంకరాపూర్, వాంకిడి గ్రామాల్లో నిర్వహించిన రైతు భరోసా ఫీల్డ్ సర్వేను ఎమ్మార్వో ఖలీమ్, ఏవో కృష్ణవేణి పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.