వెలుగు, నెట్వర్క్ : ఉమ్మడి జిల్లాలో మంగళవారం అధికారులు, ఎమ్మెల్యేలు ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు దరఖాస్తులు ఇచ్చేందుకు తరలి వచ్చారు. ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా వచ్చి కార్యక్రమాలను ప్రారంభించారు. కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పలు గ్రామాలను సందర్శించి, అర్జీదారులతో మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు.
అప్లికేషన్ ఫారాలను ఎవరూ కొనవద్దని, అధికారులు, స్థానిక ఇన్చార్జిలు ఉచితంగా పంపిణీ చేస్తారని తెలిపారు. - మొగుళ్లపల్లి మండలంలోని ఆకినపల్లి లో భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, వరంగల్ జిల్లా నర్సంపేట, దుగ్గొండి మండలాల్లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్ల సందర్శన
గ్రామాల్లో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమాలను కలెక్టర్లు సందర్శించారు. వరంగల్ లోని చార్బౌలిలోని ప్రజా పాలన సెంటర్‌ను కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండల పరిధిలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి , కలెక్టర్ సిక్తా పట్నాయక్, మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషా తో పాల్గొన్నారు. అభయహస్తం దరఖాస్తులు చేసే ప్రజలకు సహాయం అందించేందుకు హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శివలింగయ్య చెప్పారు.
జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం తిడుగు ప్రజాపాలనను ఆయన తనిఖీ చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మరిపల్లెగూడెం, వంగపల్లి లో సెంటర్లను అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా సందర్శించారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మల్లక్ పల్లిలోని గ్రామపంచాయతీలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. గ్రామ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేశారని, ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు.