మొజంజాహీ మార్కెట్​ వద్ద.. భారీ లీకేజీని అరికట్టిన అధికారులు

మొజంజాహీ మార్కెట్​ వద్ద.. భారీ లీకేజీని అరికట్టిన అధికారులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: నిత్యం ట్రాఫిక్​తో రద్దీగా ఉండే మొజంజాహీ మార్కెట్​వద్ద​కొంతకాలంగా వాటర్​లైన్​ లీకేజీకి గురవుతోంది. పరిసర ప్రాంతాల బస్తీలు, కాలనీలకు తాగునీటిలో కాలుష్యం వస్తోందన్న ఫిర్యాదులు కూడా మెట్రోవాటర్ ​బోర్డు అధికారులకు అందాయి. దీంతో 350 డయా ఎంఎం పైప్ లైన్ నీటి సరఫరా సమయంలో  లీకేజీ అవుతున్నట్టు అధికారులు గుర్తించారు. 

రద్దీ రహదారి కావడం, మాలకుంట రోడ్, రిసాలా అబ్దుల్లా, ఉస్మాన్‌‌‌‌గంజ్, శంకర్‌‌‌‌బాగ్, టాప్ ఖానా ప్రాంతాల్లో సుమారు 700 ఇండ్లకు ఈ పైప్​లైన్​ గుండా నీటి సరఫరా జరుగుతుండడంతో..  సరఫరాపై ఎలాంటి  ప్రభావం పడకుండా ఆదివారం లీకేజీని అరికట్టారు. ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పోలీస్ అధికారులతో సమన్వయంతో పనులు చేపట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు సమస్యను పరిష్కరించారు. 

ప్రధాన రహదారిపై ఉన్న పనులు చేపట్టి, లీకేజీని సమస్య పరిష్కరించిన అధికారులు, సిబ్బందిని వాటర్ బోర్డు ఎండీ అశోక్‌‌‌‌ రెడ్డి అభినందించారు. భవిష్యత్తులోనూ ఇలాగే కష్టపడి పనిచేయాలని  సూచించారు.