- మూసీ ఆక్రమణలపై సమావేశంలో అధికారులు
హైదరాబాద్, వెలుగు: మూసీ నదిలో 1,500 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, నది బఫర్ జోన్‌లో ఇంకో 6,500 వరకు అక్రమ కట్టడాలు ఉన్నాయని అధికారులు నివేదించారు. గురువారం జలసౌధలో ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ ఆధ్వర్యంలో మూసీ నదిలో ఆక్రమణలపై సమావేశం నిర్వహించారు. మూసీ నుంచి 1.58 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించాల్సి ఉండగా, ఈ ఏడాది 20 వేల క్యూసెక్కులకే అనేక నిర్మాణాలు ముంపునకు గురయ్యాయని అధికారులు తెలిపారు. 2020లో 68 వేల క్యూసెక్కుల వరద వచ్చిందని, అప్పటితో పోల్చితే ఇప్పుడు వరద తగ్గినా ముంపు ఎక్కువగా ఉందని వివరించారు. రివర్ బెడ్‌తో పాటు బఫర్ జోన్‌లో నివాసం ఉంటున్న వారిని ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ చేసి వాటిని తొలగించేలా ప్రభుత్వానికి రికమండ్ చేయాలని నిర్ణయించారు.
గండిపేట గేట్లు ఎత్తితే లక్ష క్యూసెక్కులకుపైగా ప్రవాహం సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని, ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో ఈఎన్సీ (జనరల్) మురళీధర్, జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజీత్ కంపాటి, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.