ఆ డెడ్ బాడీలు మున్సిపాల్టీకి అప్పగింత..‘వీ6 వెలుగు’ కథనంపై ఎంజీఎం అధికారుల స్పందన  

వరంగల్/ వరంగల్​సిటీ, వెలుగు : వరంగల్ ఎంజీఎం దవాఖాన మార్చురీలో ఫ్రీజర్స్ పనిచేయకపోవడంతో గుర్తుతెలియని మృతదేహాలను బయట స్ట్రెచర్లపైనే ఉంచిన ఘటనపై అధికారులు చర్యలు తీసుకున్నారు. బయటే ఉంచడంతో మృతదేహాలు కుళ్లిపోయి భరించలేనంతగా దుర్వాసన వస్తున్న విషయంపై ‘వీ6 వెలుగు’ పత్రిక బుధవారం ‘ఎంజీఎం మార్చురీలో కుళ్లిపోతున్న డెడ్ బాడీలు’ హెడ్డింగ్​తో ఓ కథనం ప్రచురించింది. దీంతో ఎంజీఎం దవాఖాన అధికారులు స్పందించారు. మార్చురీలో ఉన్న రెండు గుర్తుతెలియని మృతదేహాలను దహనం చేయడానికి మున్సిపాలిటీ సిబ్బందికి అందజేశారు.

పనిచేయని ఫ్రీజర్లను సైతం రిపేర్ చేయించనున్నట్లు చెప్పారు. మీడియా ద్వారా గుర్తుతెలియని మృతదేహాల ఫొటోలతో పోలీసులు ప్రకటన చేసినప్పటికీ ఆ మృతదేహాలను ఎవరూ గుర్తు పట్టకపోవడంతో నిబంధనల మేరకు వరంగల్ బల్దియాకు అప్పగించారు. బల్దియాకు చెందిన శానిటేషన్ వర్కర్లు ఆ డెడ్ బాడీలను వరంగల్​లోని పోతన నగర్ శ్మశాన వాటికలో దహనం చేసేందుకు తీసుకువెళ్లారు. ఆ డెడ్ బాడీలలో ఒకటి హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోనిది అని, మరొకటి ఎంజీఎంలో చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తిది అని అధికారులు తెలిపారు.