ఉమ్మడి జిల్లాలో 16.09 లక్షల ఓటర్లు

ఉమ్మడి జిల్లాలో  16.09 లక్షల ఓటర్లు
  • పంచాయతీల ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల
  • ఈనెల 21 అభ్యంతరాల స్వీకరణ , 28న తుది జాబితా
  • ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు

ఆదిలాబాద్, వెలుగు: ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 16,09,938 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గత ఓటర్ జాబితా ఆధారంగా వార్డుల వారీగా ముసాయిదా జాబితాను తయారు చేశారు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 4,41,700 మంది ఉన్నారు.

ప్రస్తుతం ఓటర్ల జాబితాను ఎంపీడీవో ఆఫీసులు, గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో ప్రదర్శనకు పెట్టారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించే క్రమంలో మొన్నటి వరకు కొత్తగా ఓటరు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. నెల రోజుల నుంచి ఈ ప్రక్రియ కొనసాగగా శుక్రవారం ముసాయిదా జాబితాను విడుదల చేశారు. విడుదల చేసిన ఓటర్ల జాబితాపై ఈనెల 21 నుంచి 26 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్న అధికారులు.. 28న తుది ఓటర్ల లిస్ట్ విడుదల చేయనున్నట్లు చెబుతున్నారు. ఓటర్ల జాబితాపై మండల, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి సలహాలు తీసుకోనున్నారు.  

మహిళలే ఎక్కువ..

ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్​లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. నిర్మల్​లో 2,10,146 మంది పురుషులుండగా.. 2,30,836 మంచి  మహిళలు, ఆదిలాబాద్​లో 2,16,242 మంది 
పురుషులుంటే.. 2,25,443 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో 1,74,279 మంది పురుషులు, 1,74,034 మంది మహిళలుండగా మంచిర్యాల జిల్లాలో  మొత్తం 3,78,912 మంది ఓటర్లున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం జిల్లాలో మహిళా ఓటర్లే కీలక పాత్ర పోషించారు.

ఈ సారి స్థానిక సంస్థల్లోనూ మహిళ ఓటర్లు ఎక్కువగా నమోదు చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం సైతం ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తుండడంతో త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని టాక్​నడుస్తోంది. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది, ఆర్వో బుక్​లు, పోలింగ్ కేంద్రాల వివరాలను సైతం సిద్ధం చేస్తున్నారు. ముందుగా పంచాయతీ ఎన్నికల నిర్వహించి, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1508 గ్రామ పంచాయతీలు, 12,780 వార్డులు న్నాయి. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 600 మంది ఓటర్లు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

రిజర్వేషన్లు మాకంటే మాకు..

ప్రస్తుతం గ్రామాల్లో ఎక్కడ చూసినా రిజర్వేషన్లపైనే చర్చ జరుగుతోంది. మాకంటే మాకు వస్తుందంటూ ఆశావహ అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రభుత్వం రిజర్వేషన్లపై ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు ఒకే రిజర్వేషన్లు ఉండేలా చట్టం తీసుకొచ్చింది. దీంతో 2019లో జరిగిన రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారా లేదా? కొత్త పద్ధతిలో నిర్వహిస్తారా అనేది తేలాల్సి ఉంది.


     జిల్లా                 ఓటర్లు 


ఆదిలాబాద్            4,41,700
మంచిర్యాల          3,78,912
నిర్మల్                    4,40,997
ఆసిఫాబాద్             3,48,329
మొత్తం                  16,09,938