- హైవే పనుల పురోగతిపై కేంద్ర సహాయ మంత్రి సంజయ్ రివ్యూ
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని హైవే విస్తరణ పనులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆదివారం సిటీలోని తన ఆఫీసులో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో సమావేశమయ్యారు. ప్రధానంగా కరీంనగర్–-జగిత్యాల, కరీంనగర్– వరంగల్(ఎన్ హెచ్ 563) రోడ్డు విస్తరణ పనులపై ఫోకస్ పెట్టారు. ఈ రెండు హైవే విస్తరణ పనులు ఎంతవరకు వచ్చాయని ఆరా తీశారు. దీనిపై కరీంనగర్–జగిత్యాల హైవే విస్తరణ పనులకు సంబంధించి 15 రోజుల్లోపు టెండర్ ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు.
ప్రధాని మోదీ రూపొందించిన 100 రోజుల ప్రణాళికలో కరీంనగర్–- జగిత్యాల హైవే విస్తరణ పనులు అంశం ఉన్న విషయం తెలిసిందే. దీంతో సెప్టెంబర్ లోగా టెండర్ పూర్తి చేసుకొని పనులు ప్రారంభించే అవకాశాలున్నాయన్నారు. మరోవైపు కరీంనగర్–వరంగల్ హైవే విస్తరణ పనులు 37 శాతం పూర్తయ్యాయని, 2025 జులై నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అధికారులు చెప్పారు.
గట్టుదుద్దెనపల్లి, చెంజర్లలో భూ సేకరణ విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడిందని చెప్పడంతో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతితో బండి సంజయ్ ఫోన్ లో మాట్లాడారు. కరీంనగర్ ఆర్డీవో ను పిలిపించి భూ సేకరణ సమస్యను పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో ఎన్ హెచ్ ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ మాధవి, అధికారులు కృష్ణారెడ్డి, నిర్మాణ సంస్థ ప్రతినిధులు రమేశ్ త్రిపాఠి, కమలేశ్ పాల్గొన్నారు.