రాష్ట్రంలో 42 పులులు.. గతంలో కంటే భారీగా పెరిగిన సంఖ్య

రాష్ట్రంలో 42 పులులు.. గతంలో కంటే భారీగా పెరిగిన సంఖ్య
  • రాష్ట్రంలో 42 పులులు.. గతంలో కంటే భారీగా పెరిగిన సంఖ్య
  • అమ్రాబాద్ ఫారెస్టులో 38, ఉమ్మడి ఆదిలాబాద్‌‌లో నాలుగు
  • పులుల సంచారంపై డ్రోన్ కెమెరాలతో నిఘా
  • ప్రతి జిల్లాకు టైగర్ సెల్ ఏర్పాటు చేసే యోచనలో అటవీ శాఖ 
  • టైగర్‌‌‌‌ కారిడార్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్న సర్కార్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పులుల సంరక్షణకు అటవీ శాఖ పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. టైగర్స్‌‌ను ట్రాక్ చేయడానికి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఇందులో భాగంగా పులి సంచరిస్తున్న అటవీ ప్రాంతాల్లో వాటి కదలికలను ట్రాక్ చేయడానికి డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నట్లు తెలిసింది. పులులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎటు వైపు వెళ్తున్నాయి? ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి తదితర వివరాలను తెలుసుకుంటున్నది. ప్రజలను అప్రమత్తం చేస్తూనే.. పులుల సంచారానికి సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచుతున్నది. 

ప్రతి జిల్లాలో టైగర్ సెల్ ఏర్పాటు చేసే యోచనలో అటవీ శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. వీటి ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం మేరకు ముందుకెళ్తున్నట్లు తెలిసింది. అలాగే, టైగర్ల కోసం కారిడార్ల అభివృద్ధికి ప్రణాళికలనూ ప్రభుత్వం రూపొందిస్తోంది. మరోవైపు, రాష్ట్రంలో పులుల సంతతి క్రమంగా పెరుగుతున్నది. ఇతర టైగర్ జోన్ల నుంచి తెలంగాణకు రాకపోకలు సాగిస్తున్నాయి. అమ్రాబాద్ అభయారణ్యంలో దాదాపు 34 పులులు ఉన్నాయి. 

అందులో 15 ఆడ పులులు, 11 మగ పులులు, 8 పులి పిల్లలు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 8 వరకు పులులు ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్ర, చత్తీస్‌‌గఢ్‌‌లోని అటవీ ప్రాంతాల నుంచి పులులు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. ప్రధానంగా మహారాష్ట్రలోని తాడోబా, తిప్పేశ్వరం, కడంబా టైగర్ జోన్ల నుంచి పులులు వస్తున్నాయని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అమ్రాబాద్ ఫారెస్ట్, నల్లమల అటవీ ప్రాంతం ఆనుకొని ఉండటంతో అక్కడి నుంచి ఎక్కువగా పులులు రాకపోకలు సాగిస్తున్నాయి.

పులులపై నిఘా..

రాష్ట్రంలో పులుల సంరక్షణకు, వాటిని ట్రాక్ చేయడానికి అత్యాధునిక సాంకేతికతను అటవీ శాఖ వినియోగిస్తోంది. ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరుస దాడుల నేపథ్యంలో పులిని ట్రాక్ చేయడానికి అడవి ప్రాంతంలో డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. అధికారులు బృందాలుగా ఏర్పడి పులి కదలికలపై నిఘా పెట్టారు. అడవిలో జంతువులను వేటాడటానికి కరెంట్ వైర్లు పెట్టడం తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. 

అటవీ ప్రాంతాల్లో, సబ్ ప్లాన్ ప్రాంతాల్లో కరెంట్ వైర్లు పెట్టకుండా విద్యుత్‌‌ సిబ్బంది తనిఖీలు నిర్వహించి తమకు సహకరించాలని కోరుతున్నారు. గ్రామాల్లో పులి పాదముద్రలు కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే, తమ గ్రామాల్లో పులి పాదముద్రలు ఉన్నాయంటూ కొంతమంది అనవసరంగా ఫోన్లు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారులు వాపోయారు. 

పులులు, వన్యప్రాణులకు సేఫ్ జోన్‌‌గా ఏటీఆర్‌‌‌‌.. 

రాష్ట్రంలో అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్, కాగజ్ నగర్ కారిడార్, వరంగల్‌‌ జోన్‌‌లోని ఏటూరు నాగారం, ములుగు, లక్నవరం, కొత్తగూడెం జోన్‌‌లోని కిన్నెసాని, పోచారం అడవుల్లో కంటే.. నాగర్‌‌కర్నూల్‌‌, నల్గొండ జిల్లాల్లో విస్తరించి ఉన్న అమ్రాబాద్‌‌ టైగర్‌‌‌‌ రిజర్వ్‌‌ (ఏటీఆర్‌‌)లో వన్యప్రాణులు, పులులకు సేఫ్‌‌ జోన్‌‌గా మారిందని అధికారులు చెబుతున్నారు. జాతీయ పులుల గణన ప్రకారం ఏటీఆర్‌‌‌‌లో పెద్ద పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2017లో ఇక్కడ 8 పులులు ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 34కు చేరింది. 

అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ పులుల ఆవాసానికి అనువుగా ఉంది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) ప్రకారం, అమ్రాబాద్, అచ్చంపేట డివిజన్లలో 10 రేంజ్‌‌లు, 903 ప్రదేశాలను 4 బ్లాకులుగా విభజించి పులుల గణన చేపట్టారు. 0.8 కిలోమీటర్ల నుంచి 2 కి.మీ. పరిధిలో సీసీటీవీ ఫుటేజీలతో నమోదైన పులుల చిత్రాలను పరిశీలించి వాటిని లెక్కించినట్లు సమాచారం. మరోవైపు, రాష్ట్రంలో మొత్తం 187 చిరుత పులులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

నాలుగు ట్రాకర్లు.. 

పులులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు టైగర్‌‌‌‌ కారిడార్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. కవ్వాల్ టైగర్ జోన్, కాగజ్‌‌నగర్ కారిడార్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎండాకాలంలో నీటి సదుపాయం కోసం సోలార్ ఆధారిత బోర్‌‌‌‌వెల్స్‌‌ ఏర్పాటు చేశామని వెల్లడించారు. పులుల సంఖ్య పెరుగుతున్నందున వాటికి ఆహారం కోసం జింకల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఒక్కో పులి జాడను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు నాలుగు ట్రాకర్లను అధికారులు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వాల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

పులుల కోసం ప్రత్యేక కారిడార్..

రాష్ట్రంలో పులుల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వేటగాళ్లు, రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి కొత్తగా ఉచ్చులను ఏర్పాటు చేయకుండా, గతంలో ఏర్పాటు చేసిన ఉచ్చులు తొలగించే చర్యలు చేపట్టాం. పులులకు నీటి లభ్యత ఉండేలా సోలార్ ఆధారిత బోర్‌‌‌‌వేల్స్ ఏర్పాటు చేశాం. పులుల సంఖ్యను బట్టి వాటి ఆహారానికి అవసరమైన నిష్పత్తిలో జింకల ను ఏర్పాటు చేస్తున్నాం. వాటి కదలికలను గమనించేం దుకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ప్రత్యేక కారిడార్‌‌‌‌ ఏర్పాటు చేయబోతున్నాం.
– మంత్రి కొండా సురేఖ