ఇందిరమ్మ ఇండ్లకు నో జీఎస్టీ : ఆఫీసర్లు

ఇందిరమ్మ ఇండ్లకు నో జీఎస్టీ : ఆఫీసర్లు
  • లబ్ధిదారుడికే నేరుగా ఇంటి శాంక్షన్
  • డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు 18 శాతం వసూలు
  • జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని నాటి బీఆర్ఎస్  సర్కారు కోరలేదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లకు జీఎస్టీ లేదని అధికారులు చెబుతున్నారు. ఇల్లు మహిళ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్  చేస్తుందని, అందుకే జీఎస్టీ లేదంటున్నారు. లబ్ధిదారుడే ఇల్లు నిర్మించుకుంటే జీఎస్టీ ఉండదని చట్టంలో ఉందంటున్నారు. దీంతో ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఫండ్స్ ఆదా అవనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున మొత్తం 4,16,500 ఇండ్లు పేదలకు ఇవ్వాలని, సీఎం విచక్షణ అధికారం కింద 38,500 ఇళ్లను  ఉంచారు. 

ఇందుకు బడ్జెట్ లో రూ.9184 వేల కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. వీటితో పాటు పీఎం ఆవాస్  స్కీం కింద కూడా ఫండ్స్  రానున్నాయి. కాగా, ఇప్పటికే గైడ్ లైన్స్ ఖరారు కాగా సీఎం ఫైనల్  చేయాల్సి ఉంది. ప్రజా పాలనలో వచ్చిన సుమారు 54 లక్షల అప్లికేషన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి గ్రామసభ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఇండ్ల కేటాయింపులో జిల్లా ఇన్ చార్జ్ మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్  కీలక పాత్ర పోషించనున్నారని అధికారులు చెబుతున్నారు.

డబుల్ ఇండ్లకు భారీగా జీఎస్టీ

గత ప్రభుత్వం నిర్మించిన డబుల్  బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వమే నిర్మించి లబ్ధిదారులకు ఇచ్చింది. ఇందులో ఇంటి ధరను రూరల్ లో రూ.5,04,000, అర్బన్ లో రూ.5,30,000, జీహెచ్ఎంసీలో రూ.7 లక్షలుగా ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ ధరలతో ఇండ్లు నిర్మించలేమని అప్పట్లో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో కాంట్రాక్టర్లకు సిమెంట్, ఇసుక పంపిణీలో ప్రభుత్వం పలు రాయితీలు ఇచ్చింది. 

అయితే, ఈ ఇండ్లను ప్రభుత్వం నిర్మించడంతో ఇంటి కాస్ట్ లో కేంద్ర ప్రభుత్వం  18 శాతం జీఎస్టీ రూపంలో వసూలు చేసింది. ఉదాహరణకు రూరల్ లో ఇంటి వ్యయం రూ.5,04,000 కాగా ఇందులో 18 శాతం (రూ. 90,720)  జీఎస్టీ రూపంలో కేంద్రానికి కాంట్రాక్టర్లు చెల్లించారు. గత ప్రభుత్వంలో డబుల్  ఇండ్ల నిర్మాణానికి రాష్ర్ట ప్రభుత్వం సుమారు రూ.13 వేల కోట్లు ఖర్చుచేయగా ఇందులో భారీగా జీఎస్టీ రూపంలో కేంద్రానికి అందింది. ఈ ఇళ్ల నిర్మాణానికి జీఎస్టీ మినహాయించాలని జీఎస్టీ కౌన్సిల్ కు వెళ్లే రాష్ర్ట  మంత్రులు, అప్పటి సీఎం కేంద్రానికి లేఖ రాయలేదని అధికారులు తెలిపారు.