హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో వాటర్ లాగింగ్ పాయింట్లు తగ్గాయని అధికారులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. గతేడాది184 ఉండగా, ఈసారి 54కు తగ్గాయని అధికారులు ప్రకటించారు. కానీ చిన్నపాటి వానకే అనేక ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలుస్తోంది. ప్రగతిభవన్ నుంచి మొదలుపెడితే రాజ్‌భవన్ రోడ్డు, సచివాలయం సమీపంలోని అనేక ప్రాంతాల్లో వరద ముందుకు పోవడం లేదు. దీంతో వాన పడిన ప్రతిసారి ఆయా ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలుస్తోంది.
ప్రస్తుతం 4 – 5 సెంటీమీటర్ల వాన కురిస్తే దాదాపు 200 చోట్ల వరద నీరు నిలుస్తోంది. డీఆర్ఎఫ్ టీమ్స్ క్లీన్ చేసేందుకు ప్రయత్నిస్తున్న కొన్ని ప్రాంతాల్లో మరుసటి రోజు కూడా వరద తొలగడంలేదు. ఈ నెల 22న సాయంత్రం వర్షం కురవగా, రవీంద్రభారతి వద్ద మరుసటి రోజు డీఆర్ఎఫ్ సిబ్బంది నీటిని క్లీన్ చేశారు. టోలిచౌకి ఫ్లై ఓవర్ వద్ద మోకాలి లోతున నిలవడంతో వెహికల్స్ స్లోగా కదిలాయి. ఖైరతాబాద్, ఎల్బీనగర్, అమీర్ పేట, మెహిదీపట్నం ఇలా చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. లెక్కల్లో వాటర్ లాగింగ్పాయింట్లు తగ్గించామని అధికారులు చెబుతున్నా కొన్ని ప్రాంతాలను అసలు లెక్కలోకి తీసుకోవడం లేదు.
మోటార్లు కూడా పెట్టట్లే
వాటర్ లాగింగ్ పాయింట్లపై జీహెచ్ఎంసీ దృష్టి పెట్టడం లేదు. వాన కురిసిన రోజు హడావిడి చేస్తున్న అధికారులు తర్వాత పట్టించుకోవడంలేదు. వర్షం పడిన వెంటనే రోడ్లపై నీరు నిలవ
కుండా చర్యలు తీసుకుంటే సమస్య ఉండదు. పట్టించుకోకపోవడంతో మెయిన్రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాటర్ లాగింగ్ పాయింట్ల పరిస్థితి ఏండ్లుగా అలాగే కొనసాగుతోంది. రోడ్లు హైట్ పెంచినా, కొత్త డ్రైనేజీలు నిర్మిస్తున్నా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. సిటీ మొత్తం ఒకేసారి వర్షం కురిస్తే సిబ్బందికి పెద్ద సవాల్‌గా మారుతోంది. కనీసం వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద మోటార్లను కూడా అందుబాటులో ఉంచడంలేదు.
ఈ ఏరియాల్లోనే ఎక్కువ సమస్య
పంజాగుట్టలోని ఎన్‌ఎఫ్‌సీఎల్ ఫ్లైఓవర్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ రాజ్‌భవన్ రోడ్, ధరమ్ కరమ్ రోడ్, బేగంపేటలోని యాక్సిస్ బ్యాంక్, కర్బాలా మైదాన్, ఆర్పీ రోడ్, కార్ఖానా రోడ్, కేఎఫ్‌సీ, చిత్రదుర్గ,
సైఫాబాద్‌లోని షాదన్ కాలేజీ, అయోధ్య జంక్షన్, నాంపల్లిలోని పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్, సికింద్రాబాద్ రైల్ నిలయం జంక్షన్, ఆలుగడ్డ బావి, సుల్తాన్ బజార్‌లోని రంగమహల్, అఫ్జల్‌గంజ్ సెంట్రల్ లైబ్రరీ, మలక్‌పేటలోని అక్బర్ ప్లాజా, మలక్‌పేట గంజ్, చాదర్‌ఘాట్ రైల్వే ఆర్‌ఓబీ, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్, పెన్షన్ ఆఫీస్ సిగ్నల్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ –36 క్రోమా స్టోర్ తదితర ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ పాయింట్లు మేజర్‌గా ఉన్నాయి. వాన పడిన ప్రతిసారి జీహెచ్ఎంసీకి వస్తున్న కంప్లయింట్స్ లో సగానికిపైగా వాటర్ లాగింగ్ మీదనే ఉంటున్నాయి. దాదాపుగా ఈ ప్రాంతాల నుంచే వస్తున్నాయి.
భారమంతా డీఆర్ఎఫ్పైనే..
సిటీలో వర్షం పడితే అంతా డీఆర్ఎఫ్(డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫోర్స్) సిబ్బంది చూసుకుంటారని జీహెచ్ఎంసీ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. డీఆర్ఎఫ్ జీహెచ్ఎంసీలో ఓ భాగమైనప్పటికీ సర్కిల్, జోనల్ స్థాయి అధికారులు ఎలాంటి సపోర్టు ఇవ్వడం లేదు. డీఆర్ఎఫ్ వద్ద కేవలం 450 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. కోటికి పైగా జనాభా ఉన్న గ్రేటర్ సిటీలోని వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద వీరే వర్షపు నీటిని తొలగించాలి. వానల టైంలో ఎక్కడైనా రెస్క్యూ అవసరమైతే వీరే చూసుకోవాలి. కనీసం సర్కిల్, జోనల్ అధికారులు మాన్సూన్ టీమ్స్‌ను వీరికి సపోర్టుగా ఉంచితే ఎంతో మేలు జరుగుతుంది. కానీ రోడ్లపై నీరు నిలబడితే తమకేమి పట్టనట్టుగా సర్కిల్, జోనల్ అధికారులు వ్యవహరిస్తున్నారు.