ప్యాకేజీల వారీగా వివరాలివ్వండి!

ప్యాకేజీల వారీగా వివరాలివ్వండి!

 

  • సీతారామ ప్రాజెక్టు అంచనాల సవరణపై అధికారుల స్క్రూటినీ
  • రేపు స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీలో చర్చించి నిర్ణయం

హైదరాబాద్, వెలుగు:  సీతారామ ప్రాజెక్టు అంచనాల పెంపుపై ఉన్నతాధికారులు మరోసారి దృష్టి సారించారు. ప్రాజెక్టులోని అన్ని ప్యాకేజీల వారీగా వివరాలివ్వాల్సిందిగా సంబంధిత ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. ఒక్కో ప్యాకేజీకి సంబంధించిన వాస్తవ అంచనాలు.. 2018లో సవరించిన అంచనాలు.. ఇప్పుడు కొత్తగా ఇచ్చిన రివైజ్డ్ ఎస్టిమేట్స్ సహా అన్ని వివరాలను ఇవ్వాల్సిందిగా ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. 

ఇటీవల కొత్తగూడెం సీఈ సీతారామ ప్రాజెక్టు అంచనాలను రూ.13,400 కోట్ల నుంచి రూ.19,800 కోట్లకు సవరించి ఉన్నతాధికారులకు పంపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దాదాపు 80 నుంచి 90 శాతం వరకు పనులు పూర్తయినా ఒక్కసారిగా అంత అంచనాలను పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందని ఉన్నతాధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది.

 ప్రాజెక్టులోని 16 ప్యాకేజీలకు సంబంధించిన పనుల వివరాలు, ఎక్కడి వరకు వచ్చాయి.. ఇంకా ఎంత పూర్తి చేయాలన్న డిటెయిల్స్​ను అడిగినట్టు సమాచారం. ఆయా ప్యాకేజీలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణానికి విడివిడిగా అంచనాల వివరాలను సమర్పించాలని అధికారులకు సూచించారని సమాచారం. అప్పుడున్న రేట్లేంటి.. ఇప్పుడున్న ధరలెంత అనే వివరాలనూ కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా అధికారులు ఆయా వివరాలపై కసరత్తులు చేస్తున్నట్టుగా తెలిసింది. ప్యాకేజీల అంచనా వ్యయాన్ని స్క్రూటినీ చేసి పైఅధికారులకు పంపుతారని తెలిసింది. 

ఈ స్క్రూటినీ చేసిన అంచనాలపై శనివారం నిర్వహించే స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీలో చర్చించి అంచనాలపై నిర్ణయం తీసుకోనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. స్టాండింగ్ కమిటీలో ఓకే చేశాక ఆ అంచనాలను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపనున్నట్టు అధికారులు చెబుతున్నారు.