తెలంగాణలో స్ట్రాంగ్​రూమ్​లకు సీల్ ​వేసిన అధికారులు

ఆసిఫాబాద్, వెలుగు: పోలింగ్​కేంద్రాల్లో ఓటింగ్​తర్వాత ఎలక్ట్రానిక్​ఓటింగ్​ యంత్రాలను స్ట్రాంగ్​రూమ్​లకు చేర్చారు. వాటిని భద్రపరిచిన కలెక్టర్లు రూమ్​లకు సీల్​ వేశారు. కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలోని స్ట్రాంగ్ రూమ్​లో భద్రపరిచి సీల్ వేసినట్లు ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు తెలిపారు.

ఎన్నికల సాధారణ పరిశీలకులు రాహుల్ మహివాల్, ఎస్పీ సురేశ్ కుమార్ సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు దీపక్ తివారి, దాసరి వేణుతో కలిసి స్ట్రాంగ్ రూమ్ లకు సీల్ వేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర బలగాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అడిషనల్ ఎస్పీ అచ్చేశ్వర రావు, డీఎస్పీలు వెంకటరమణ, కరుణాకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్​లో..

ఆదిలాబాద్​ టౌన్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో ఏర్పాటు చేసిన ఆదిలాబాద్, బోథ్ అసెంబ్లీ  నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్​లకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ​రాహుల్​రాజ్​ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీల్ వేశారు. ఈ సందర్భంగా ఎస్పీ డి.ఉదయ్​కుమార్​ రెడ్డి స్ట్రాంగ్ రూమ్​ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. బందోబస్తులో ఉన్న పోలీసులకు పలు సూచనలు చేశారు. కేంద్ర బలగాలు బీఎస్ఎఫ్ సిబ్బంది, జిల్లా సాయుధ సిబ్బంది అనుక్షణం పహార కాస్తుంటారని తెలిపారు. కార్యక్రమంలో జనరల్, పోలీస్ పరిశీలకులు నితిన్ కె పాటిల్, అశోక్ గోయల్, ఆర్ఓలు స్రవంతి, చాహత్ బాజ్ పాయ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మంచిర్యాలలో..

నస్పూర్: మంచిర్యాల జిల్లాలోని నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ ​మెషీన్లను హాజీపూర్ మండలం ముల్కల్లలోని ఐజా ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్​లలో భద్రపరిచి సీల్ వేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల అధికారుల కృషి, రాజకీయ పార్టీల సహకరంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. ఈ నెల 3న జరిగే కౌంటింగ్ ప్రక్రియ సైతం సజావుగా సాగేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ఈ నెల 5 వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు బిశ్వజిత్ దత్తా, సజ్జన్ ఆర్, పోలీసు పరిశీలకుడు ఆర్.ఇలంగో, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల రిటర్నింగ్ అధికారులు, డీసీపీ సుధీర్ నాంనాథ్ కేకన్ పాల్గొన్నారు.