హుస్సేన్​సాగర్​లో ఇంకా దొరకని యువకుడు ఆచూకీ

హుస్సేన్​సాగర్​లో ఇంకా దొరకని యువకుడు ఆచూకీ
  • నాలుగు బృందాలు గాలించినా దొరకని ఆచూకీ
  • కొడుకు జాడ కోసం ట్యాంక్ బండ్  వద్దే పేరెంట్స్ 
  • యశోదలో చికిత్స పొందుతున్న గణపతి పరిస్థితి విషమం 
  • భరతమాత ఫౌండేషన్​పై కేసు నమోదు 

ముషీరాబాద్/హైదరాబాద్​సిటీ, వెలుగు:  భారతమాతకు హారతి కార్యక్రమం సందర్భంగా పటాకులు పేలి బోట్లు దగ్ధమైన ఘటనలో అజయ్  అనే యువకుడు గల్లంతయ్యాడు. సోమవారం నాలుగు బృందాలు గాలించినా ఆ వ్యక్తి ఆచూకీ దొరకలేదు. పీపుల్స్  ప్లాజా గ్రౌండ్స్ లో భారతమాత ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి భరతమాతకు మహాహారతి కార్యక్రమం నిర్వహిస్తుండగా..  హుస్సేన్​సాగర్​లో పటాకులు కాల్చడానికి సిద్ధంగా ఉంచిన బోట్లు కాలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిని 8 మందిని గాంధీ, యశోద దవాఖానలకు తరలించారు. దాదాపు అందరూ డిశ్చార్జి అయినా.. తీవ్రంగా గాయపడి యశోదలో చికిత్స పొందుతున్న తూర్పు గోదావరికి చెందిన గణపతి పరిస్థితి విషమంగా ఉంది. 

అంబర్​పేటకు చెందిన చింతల కృష్ణ, హుజూరాబాద్​కు చెందిన సాయి చంద్​ స్వల్పంగా గాయపడడంతో వారిని యశోదకు తరలించారు. సునీల్, ప్రవీణ్​10 శాతం కాలిన గాయాలతో గాంధీలో చేరి డిశ్చార్జ్  అయ్యారు. కాగా.. మహాహారతి కార్యక్రమంలో వైజాగ్  చెందిన మణికంఠకు క్రాకర్స్  ఈవెంట్  బాధ్యతలు అప్పగించారు. మణికంఠ గతంలో హైదరాబాద్ కు చెందిన రాఘవేందర్ కు పటాకులు సరఫరా చేశాడు. ఈ డబ్బులు ఇవ్వడానికి రాఘవేందర్  తన ఫ్రెండ్స్​సాయి సందీప్, అజయ్ ను తీసుకుని ఆదివారం సాయంత్రం నెక్లెస్  రోడ్డుకు వచ్చాడు. మణికంఠను కలిసి డబ్బులు ఇచ్చాక వారు కూడా ఒక పడవలో మణికంఠతో పాటు సాగర్​లోకి వెళ్లారు.

 ప్రమాదం జరిగినప్పుడు రెండు బోట్లలో 15 మంది ఉన్నారు. ఈత వచ్చిన వారు, లైఫ్​ జాకెట్లు​వేసుకున్న వారు నీళ్లలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ, అజయ్​ జాడ మాత్రం దొరకలేదు. దీంతో డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, టూరిజం ఉదయం నుంచి రాత్రి వరకు గాలింపు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. అజయ్.. గీతాంజలి ఇంజినీరింగ్ కాలేజీలో బీ-టెక్  ఫైనల్  ఇయర్​ చదువుతున్నాడు. ఉదయమే ట్యాంక్​బండ్​కు వచ్చిన అతని తల్లిదండ్రులు జానకి రామ్, నాగలక్ష్మి దంపతులు సాయంత్రం వరకూ కొడుకు జాడ దొరుకుతుందేమోనని అక్కడే ఏడుస్తూ ఉన్నారు. 

ఫౌండేషన్​పై కేసు నమోదు 

ఘటనకు భరతమాత ఫౌండేషన్​ను బాధ్యులను చేస్తూ సెక్రటేరియేట్​ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా..  గాయపడిన ఔట్​సోర్సింగ్​బోటు డ్రైవర్లు ప్రణీత్, సునీల్ కు వైద్యఖర్చుల కోసం రూ.5 లక్షల ఇవ్వాలని తెలంగాణ స్టేట్  టూరిజం కాంట్రాక్ట్  ఔట్​సోర్సింగ్​ డైలీ వేజెస్  ఎంప్లాయీస్  వర్కర్స్ యూనియన్  డిమాండ్  చేసింది. మరోవైపు ఘటనకు భారతమాత ఫౌండేషన్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యత  వహించాలని చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు చిక్క దేవదాస్  డిమాండ్  చేశారు.  

బోటు ప్రమాదానికి బాధ్యులెవరు?

బోటు ప్రమాదానికి బాధ్యులెవరని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్  సోమవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. గల్లంతైన అజయ్  ఆచూకీ ఇప్పటి వరకూ లభించకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులను ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా పరామర్శించకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. పోలీసులు ఈ ఘటనపై ఎందుకు నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. భారతమాత మహాహారతి కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌‌ రెడ్డి, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్‌‌, రఘునందన్‌‌ రావు, కొండా విశ్వేశ్వర్‌‌ రెడ్డి బోటు ప్రమాదంపై  స్పందించకపోవడం బాధాకరమన్నారు. 24 గంటల్లోలోపు కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఆయన  హెచ్చరించారు.