
- 3లారీలు, 4డీసీఎంలు సీజ్
పటాన్చెరు, వెలుగు: టాస్క్‌ఫోర్స్, సివిల్ సప్లై సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో అక్రమంగా తరలించేందుకు సిద్దంగా ఉన్న 500 క్వింటాళ్ల పీడీఎస్బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 3 లారీలు, 4 డీసీఎంలను సీజ్ చేశారు. ఈ మేరకు ఎస్పీ రూపేశ్ సోమవారం వివరాలు వెల్లడించారు. భానూర్ పీఎస్ పరిధిలో ని పాశమైలారం గ్రామంలో అక్రమంగా నడుపుతున్న ఒక రైస్ మిల్లును తనిఖీ చేయగా పీడీఎస్ బియ్యాన్ని గుర్తించినట్లు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ టౌన్‌కు చెందిన ప్రభాకర్ రెడ్డి కొంత కాలంగా రైస్ మిల్లును నడుపుతూ ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన వడ్లను తన రైస్ మిల్లులో పట్టించి పీడీఎస్‌రైస్ గా మార్చి ఎఫ్‌సీఐ గోదాంకు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో ప్రభాకర్ రెడ్డి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రభుత్వం పంపిణీ చేసిన పీడీఎస్ రైస్ ను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని గోదాంకు పంపించే రైస్ తో కలిపి పంపిస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నట్లు చెప్పారు.
తన వ్యాపారానికి వీలుగా సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో రైస్ మిల్లును ఏర్పాటు చేసుకుని తన దందాను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నిందితుడు ప్రభాకర్ రెడ్డి పరారీలో ఉండగా, రైస్ మిల్లు నడుపుతున్న రవిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.