- ముగ్గురు నిందితులు అరెస్ట్
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 621 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లోని కారు పార్కింగ్ ఏరియాలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఎస్‌వోటీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా, వారి వద్ద అక్రమంగా తరలిస్తున్న బంగారం బయటపడింది. ఆదివారం సౌదీ అరేబియా నుంచి ఏపీలోని కడపకు ఈ బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. చాలా కాలంగా వారు ఈ స్మగ్లింగ్‌ను చేస్తున్నట్లు గుర్తించారు.
ఈ క్రమంలోనే ఆదివారం విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని తరలిస్తుండగా, వారిని పోలీసులు పట్టుకున్నారు. నిందితులు కడప జిల్లాకు చెందిన షేక్ చాంద్ పాషా, షేక్ అబ్దుల్ సాధిక్, మహమ్మద్ మున్నా పాషాగా గుర్తించారు. వారి నుంచి మూడు ఫోన్లు, 491 గ్రాముల బంగారు గాజులు, 130 గ్రాముల ఆరు గొలుసులను, రూ.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.