- ఇప్పటిదాకా 2,561 కి.మీ పైపులైన్, 2.03 లక్షల మ్యాన్ హోళ్లు శుభ్రం
- నిర్ణీత సమయంలో టార్గెట్ చేరుకోవాలన్న వాటర్ బోర్డు ఎండీ
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో మెట్రో వాటర్‌బోర్డు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీ- స్పెషల్ డ్రైవ్’ లక్ష్యం దిశగా కొనసాగుతున్నది. సీవరేజ్ పైపులైన్లు, మ్యాన్ హోళ్లలో పూడికతీత పనులు రోజూ జరుగుతున్నాయి. 3 లక్షల మ్యాన్ హోళ్లు, పైప్లైన్లను డీసిల్టింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు.. ఇప్పటిదాకా 19,688 ప్రాంతాల్లో పనులు పూర్తిచేసినట్టు తెలిపారు. 2,561 కి.మీ. మేర సీవరేజ్ పైప్ లైన్, 2.03 లక్షల మ్యాన్ హోళ్లలో డీ-సిల్టింగ్ పనులు పూర్తి చేశామన్నారు.
స్పెషల్ డ్రైవ్‌పై ఫోకస్ పెట్టి క్రమంగా విధులు నిర్వర్తిస్తున్న క్షేత్ర స్థాయి సిబ్బంది, అధికారులను ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ అభినందించారు. డాష్ బోర్డులో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఇందులో ఏవైనా సమస్యలుంటే ఐటీ విభాగం అధికారుల సాయం తీసుకోవాలన్నారు. అవసరమైన చోట్ల నూతన సీవరేజ్ పైపులైన్ నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది పనితీరు, స్పెషల్ డ్రైవ్ పురోగతిపై సంబంధిత సీజీఎంలు, డైరెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని సూచించారు. నిర్దేశిత సమయంలో లక్ష్యాన్ని పూర్తి చేరుకోవాలన్నారు.