ములుగు, వెలుగు : సాగులో సందేహాలు తీర్చేందుకు రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లా వ్యవసాయ అధికారి జయచంద్రతో కలిసి వ్యవసాయ విస్తీర్ణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు స్థానిక ఏఈవోలు అందుబాటులో ఉండాలని, రైతులకు సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సమస్య తీవ్రతను బట్టి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు.
వివిధ అంశాలలో రైతులకు వచ్చే సందేహాలను నివృత్తి చేయాలన్నారు. భూముల స్వర్వే నంబర్ ఆధారంగా పంటల వారీగా క్రాప్ బుకింగ్ చేయాలని తెలిపారు. వ్యవసాయ అధికారులను ఈపాస్ ఏఈఓ లాగిన్ ఏ విధంగా పని చేస్తుందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ములుగు మండలంలోని రామచంద్రపురం గ్రామంలోని దుబాసి చంద్రమౌళి ఫర్టిలైజర్ షాప్ ను సందర్శించారు.
షాప్ లోని స్టాక్ వివరాలు, రశీదులు పరిశీలించారు. ఈపాస్ యంత్రాల పనితీరు, తదితర వివరాలను షాప్ యజమానిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ములుగు ఏడిఏ కె.శ్రీపాల్, ఏటూరు నాగారం ఏడిఏ యన్.శ్రీధర్, మండల వ్యవసాయ అధికారి సంతోష్, వ్యవసాయ విస్తరణ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.