డిప్యుటేషన్​పై వచ్చి.. పాతుకుపోతున్నరు!

డిప్యుటేషన్​పై వచ్చి.. పాతుకుపోతున్నరు!
  • డిప్యుటేషన్​పై వచ్చి.. పాతుకుపోతున్నరు!
  • జీహెచ్ఎంసీని వీడేందుకు ఇంట్రెస్ట్​ చూపని అధికారులు

హైదరాబాద్, వెలుగు:  జీహెచ్ఎంసీలో డిప్యుటేషన్​పై వచ్చిన అధికారులు అక్కడే పాతుకుపోతున్నారు. సొంత డిపార్ట్​మెంట్​కు తిరిగి వెళ్లేందుకు ఏ మాత్రం ఇష్టపడటం లేదు. పైరవీలతోనే జీహెచ్ఎంసీకి వస్తూ.. ఇక్కడే ఉండిపోయేందుకు కూడా పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డిప్యుటేషన్​పై వచ్చిన వారు మూడేళ్ల వరకే ఆ డిపార్ట్​మెంట్​లో పనిచేయాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి మరో  రెండేళ్లు కొనసాగవచ్చు. కానీ చాలా మంది ఈ రూల్స్​ను పట్టించుకోవడమే లేదు. భారీగా అక్రమ సంపాదన ఉండటంతోనే వెళ్లడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారుల విచారణలోనూ ఇదే విషయం బయటపడింది.

సొంత డిపార్ట్ మెంట్​కు రావాలని చెప్పినా..

ఎలక్ట్రిసిటీ, మెడికల్ అండ్ హెల్త్, పశు సంవర్ధకశాఖ, గ్రౌండ్ వాటర్ డిపార్ట్​మెంట్, పోలీస్ తదితర డిపార్ట్​మెంట్ల నుంచి అధికారులు డిప్యుటేషన్​పై వచ్చి  జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నారు. అయితే, ఇలా వస్తున్న అధికారులను తిరిగి సొంత డిపార్ట్​మెంట్​కు రమ్మని పిలిచినా వెళ్లకపోవడంతో కొంతమంది ఉద్యోగులకు సదరు డిపార్ట్​మెంట్ గత మూడు నెలలుగా వేతనాలు నిలిపివేసింది. అయినా కూడా ఆయా శాఖలకు వెళ్లేందుకు వాళ్లు ఇష్టపడటం లేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్​మెంట్ నుంచి డిప్యుటేషన్​పై 18 మంది జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నారు. ఇందులో ఐదుగురికి సొంత శాఖకు రావాలని గతంలోనే ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ వీరిలో ముగ్గురు ఇప్పటికీ ఆ డిపార్ట్ మెంట్​​కు రిపోర్ట్ ​చేయలేదు. ఇంకా జీహెచ్ఎంసీలోనే కొనసాగుతున్నాయి. అక్రమ సంపాదన కారణంగానే.. మూడు నెలలుగా జీతాలు నిలిపివేసినా జీహెచ్ఎంసీని వీడటం లేదనే విషయం బయట
పడుతోంది.

ఏఎంవోహెచ్​లపై లెక్కలేనన్ని ఆరోపణలు

జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్లు హెల్త్ డైరెక్టరేట్ ​నుంచి డిప్యుటేషన్​పై వస్తున్నారు. ఒక్కసారి వచ్చిన అధికారులు ఇక తిరిగి వెళ్లేందుకు ఏ మాత్రం ఇంట్రెస్ట్ ​చూపడం లేదు. ఏ పని చేసినా మెడికల్ ఆఫీసర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొందరు ప్రత్యక్షంగానే విమర్శలకు దిగిన సందర్భాలున్నాయి. కిందిస్థాయి ఉద్యోగుల నుంచి కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు పలువురు ఉద్యోగులు నేరుగా కమిషనర్​కే ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీలో మెడికల్ ఆఫీసర్లు డిప్యుటేషన్ పైన వచ్చిన వారే పనిచేస్తున్నారు. డిప్యుటేషన్​పై వచ్చి ఐదేండ్లకు మించి పనిచేస్తున్న అధికారులపై విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​అధికారులు గతంలోనే ఫోకస్ పెట్టారు. కొంతమంది మెడికల్ ఆఫీసర్లపై పెద్దఎత్తున ఆరోపణలు, విమర్శలు రావడంతో వాళ్లు మాకొద్దంటూ పలువురు జోనల్ కమిషనర్లు ఏకంగా ఉన్నతాధికారులను వేడుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం  చేసుకోవచ్చు. 

మూడేండ్లు పూర్తయిన వాళ్లను పంపాలి 

డిప్యుటేషన్​పై వచ్చి మూడేండ్ల సర్వీస్ దాటినోళ్లను తిరిగి సొంత డిపార్ట్​మెంట్​కు పంపాలి. కానీ ఒకే చోట 15 ఏండ్లుగా  పనిచేస్తున్న వారు కూడా బల్దియాలో ఉన్నారు. అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆదాయాన్ని పక్క దారి పట్టిస్తున్నారు. వారిపై ఎన్నో ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోవడం లేదు.

- ఊదరి గోపాల్,

జీహెచ్ఎంఈయూ  ప్రెసిడెంట్

ముందు నోటీసులు.. ఆపై సెటిల్​మెంట్లు బర్త్, డెత్ సర్టిఫికెట్లు, ట్రేడ్ లైసెన్సులు, స్వీపర్ల బిల్లులు, ఖాళీల భర్తీల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. హాస్టళ్లకు ట్రేడ్ లైసెన్లకు సంబంధించి కిచెన్ క్లీన్​గా లేదని, అంతస్తులు ఎక్కువగా ఉన్నాయని నోటీసులు జారీ చేస్తున్న అధికారులు.. ఆ తర్వాత వారితో సెటిల్​మెంట్లు చేసుకుంటున్నారనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒక్కో హాస్టల్ రెండు, మూడు ఫ్లోర్లలో కొనసాగుతుండగా కేవలం గ్రౌండ్ ఫ్లోర్ వరకు మాత్రమే ట్రేడ్ లైసెన్స్ జారీ చేస్తూ బల్దియాకి రావాల్సిన ఖజానాను వారి సొంత జేబుల్లో నింపుకుంటున్నారు. ఇందులో మెడికల్ ఆఫీసర్లతో పాటు శానిటరీ సూపర్ వైజర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. శేరిలింగంపల్లి, అంబర్​పేట, ఖైరతాబాద్, ముషీరాబాద్, బేగంపేట, బంజారాహిల్స్ సర్కిళ్లలో నోటీసులు జారీ చేసి ఆ తర్వాత ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా వదిలేసినవి చాలా ఉన్నాయి.