నాగార్జునసాగర్​ ఎడమ కాలువకు పలు చోట్ల గండి

  • వందలాది ఎకరాల్లో పంట వరద పాలు
  • చుట్టుపక్క గ్రామాలను ఖాళీ చేయిస్తున్న ఆఫీసర్లు

నడిగూడెం(మునగాల), వెలుగు: నాగార్జునసాగర్ ఎడమ కాలువకు భారీ గండి పడింది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద, మరికొన్ని చోట్ల గండి పడడంతో చుట్టుపక్కల గ్రామాల్లోని వందలాది ఎకరాల్లో పంట పొలాల్లోకి వరద నీరు ప్రవహిస్తున్నది. సుమారు 12 ఎకరాల వరకు ఇసుక మేటలు ఏర్పడినట్లు రైతులు చెప్తున్నారు. వరద ఉధృతి పెరగడంతో ఖమ్మం జిల్లా పరిధిలోని పాలేరు, ఈశ్వర మాదారం, రాజుపేట, కూసుమంచి, నాయకన్ గూడెం గ్రామాలతో పాటు మరో రెండు తండాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. 

ఎడమ కాలువకు నీటి విడుదల నిలిపివేత 

సాగర్​ కాలువకు రెండు చోట్ల గండిపడడంతో ఎన్ఎస్పీ అధికారులు వెంటనే ఎడమ కాలువకు నీటి విడుదలను ఆపేశారు. ఖమ్మం జిల్లాలోని రంగుల బ్రిడ్జి పక్కన ఎన్​ఎస్పీ అధికారులు రిపేర్లు సరిగ్గా చేయకపోవడం వల్లను గండ్లు పడ్డాయని, తమ పంటపొలాలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి రిపేర్లు చేయకుంటే పెద్ద ప్రమాదం పొంచి ఉంటుందని అంటున్నారు. కాగా, సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం దగ్గర కాలువకు 117 కిలోమీటర్ల వద్ద మరో ప్రమాదం పొంచి ఉంది.

 ఖమ్మం జిల్లా పాలేరు తాగునీటి అవసరాలకోసం ప్రభుత్వం నీరు విడుదల చేసిన సమయంలో కాలువ కట్టకు బుంగ పడింది. అప్పుడు ఆఫీసర్లు తాత్కాలిక రిపేర్లు చేసి కట్టమీద రాకపోకలు నిలిపివేస్తూ ఫ్లెక్సీ పెట్టి వెళ్లారు. ఆతర్వాత అటువైపు చూడకపోవడంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షం వల్ల వరద ఉధృతి పెరిగి కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. వెంటనే పూర్తి స్థాయిలో రిపేర్లు చేయాలని రైతులు కోరుతున్నారు.