వేములవాడ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి

వేములవాడ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి
  • అధికారులను ఆదేశించిన మంత్రులు కొండా సురేఖ, పొన్నం 
  • టెంపుల్ మాస్టర్ ప్లాన్​పై సెక్రటేరియెట్​లో  రివ్యూ మీటింగ్ 
  • 6 కోట్లతో ఆలయ గోపురానికి 16 కిలోల బంగారు తాపడం
  • 2 ఎకరాల్లో వేదపాఠశాల ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: మరో వందేండ్లపాటు మనగలిగేలా వేములవాడ దేవాలయాన్ని అభివృద్ధి చేసే దిశగా మాస్టర్ ప్లాన్ చేపట్టాలని అధికారులను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. దేవాలయాల అభివృద్ధికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో ఆగమ శాస్త్ర ప్రకారం పూజా కార్యక్రమాలు, కైంకర్యాలు చేపట్టేందుకు అంతే ప్రాధాన్యమివ్వాలని సూచించారు. గురువారం ఆమె సెక్రటేయెట్​లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి వేములవాడ ఆలయం మాస్టర్ ప్లాన్, అభివృద్ధి కార్యకలాపాలపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.

మాస్టర్ ప్లాన్​ను కన్సర్వేషన్  ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. " భక్తుల మనోభావాలకు ఇబ్బంది కలగకుండా టెంపుల్ అభివృద్ధి పనులు చేపట్టాలి. టూ, ఫోర్ వీలర్లు, బస్ పార్కింగ్ లకు వేర్వేరు స్థలాలను కేటాయించాలి.

పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.  వేదపాఠశాలను శాస్త్ర ప్రమాణాలతో నిర్వహించి, విద్యార్థులు ఆధ్యాత్మిక వాతావరణంలో విద్యనభ్యసించేలా వేదపాఠశాలను తీర్చిదిద్దాలి. 2 ఎకరాల్లో  బిల్వ వనాన్ని, మరో 2 ఎకరాల్లో వేదపాఠశాలను ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందేలా గొప్పగా తీర్చిదిద్దాలి" అని అధికారులకు మంత్రి సురేఖ స్పష్టం చేశారు.  

గోపురం తాపడానికి 16 కిలోల బంగారం

వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులనుపై మంత్రి సురేఖ ఆరా తీశారు. భూసేకరణపై సమగ్ర నివేదికను సమర్పించాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ ను ఆదేశించారు. విమాన గోపురం 3200 చదరపు అడుగులు ఉందని,  గోపురం తాపడానికి 16 కిలోల బంగారం అవసరం కాగా, దేవాలయం వద్ద 59 కిలోల బంగారం వున్నట్లు ఈవో వినోద్ వివరించారు. బంగారు తాపడం పనులకు దాదాపు 6 కోట్ల ఖర్చవుతుందని తెలిపారు. 

త్వరలో సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ ఆలయాన్ని దర్శించనున్న నేపథ్యంలో వేములవాడ మాస్టర్ ప్లాన్, అభివృద్ధి పనులపై సమగ్ర పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను సమర్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. నూతన అన్నదాన సత్రాన్ని ఎంతమంది భక్తులు వచ్చినా ఆకలి తీర్చేలా నిర్మించాలని అధికారులకు సూచించారు. 

శాస్త్ర ప్రకారం నిర్మాణాలు జరిగేలా మాస్టర్ ప్లాన్ ను అభివృద్ధి చేయాలని ఆర్కిటెక్ట్ కు తెలిపారు. మీటింగులో ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, కమిషనర్ హనుమంతు, సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్లు కృష్ణవేణి, జ్యోతి, కంచి కామకోటి పీఠం సలహాదారు గోవింద హరి, స్థపతి ఎన్. వల్లి నాయగన్, ప్రధానార్చకులు ఉమేశ్ తదితరులు పాల్గొన్నారు.

నెహ్రూకు నివాళి

దేశంలో నెహ్రూ పాలన స్వర్ణయుగం అని మంత్రి కొండా సురేఖ అన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నెహ్రూ ఆధునిక భారతదేశ రూపశిల్పి అని కొనియాడారు. శక్తివంతమైన దేశంగా ఎదగడంలో నెహ్రూ అమలు చేసిన ప్రణాళికలు, విధానాలు అద్వితీయమైన పాత్ర పోషించాయన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నెహ్రూ ఆశయాల సాధనకు కృషి చేస్తున్నదని మంత్రి స్పష్టం చేశారు.