మిట్టపల్లిలో  రోడ్డు విస్తరణ లొల్లి

మిట్టపల్లిలో  రోడ్డు విస్తరణ లొల్లి
  • ఆర్వోబీ సర్వీస్ రోడ్డుపై అభ్యంతరాలు
  • ఇండ్లు, ప్లాట్ల కు నష్టమంటున్న గ్రామస్తులు 
  • గ్రామ సభను బహిష్కరించి ఆందోళన

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో రోడ్డు విస్తరణ లొల్లి మొదలైంది. గ్రామ శివారులో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) కోసం భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసి గ్రామ సభ నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండా గ్రామ సభ ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. భూసేకరణ వల్ల విలువైన ప్లాట్లు, ఇండ్లను కొల్పోవాల్సివస్తోందని ఆందోళనకు దిగడంతో అధికారులు గ్రామ సభ నిర్వహిచకుండానే వెల్లిపోయారు.

దీంతో ఆర్వొబీ నిర్మాణానికి భూసేకరణపై అనుమానాలు మొదలైనాయి. సిద్దిపేట నుంచి వరంగల్ మార్గంలో ఎల్కతుర్తి వరకు 765 డీజీ నేషనల్ హై వేను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా మిట్టపల్లి వద్ద రైల్వే లైన్ పై ఆర్వోబీని నిర్మిస్తున్నారు. దాదాపు 1.2 కిలో మీటర్ల మేర 55 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ బ్రిడ్జి పనులు గత ఏడాది జూలై లో ప్రారంభించారు. రోడ్డు విస్తరణ పనులను నేషనల్ హై అధారిటీ, ఆర్వొబీ నిర్మాణాన్ని ఆర్ అండ్ బీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 

సర్వీస్ రోడ్డుతోనే సమస్య

 మిట్లపల్లి వద్ద ఆర్వోబీ దగ్గర నేషనల్​హైవే పనుల్లో భాగంగా 100 మీటర్ల మేరకు రోడ్డు విస్తరణ చేయాలని మొదట నిర్ణయించారు. ఆర్వోబీతో పాటు సర్వీస్​రోడ్డు కూడా నిర్మించాలని తర్వాత నిర్ణయం తీసుకున్న అధికారులు గ్రామంలో భూసేకరణ కోసం సిద్ధమయ్యారు. ఆర్వోబీ కోసం 1.2 కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తుండగా దానికి భూసేకరణ చేయాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు ఆర్వోబీకి రెండు వైపులా 5.5 మీటర్ల మేర సర్వీస్ రోడ్డు నిర్మించనుండడంతో 150 మీటర్ల కు మరోసారి మార్కింగ్ చేస్తున్నారు. ఇందుకోసం గ్రామస్తుల నుంచి భూసేకరణ చేయాల్సివస్తోంది. గతంలో చేసిన మార్కింగ్ ప్రకారం కొంతమంది ఇండ్లు నిర్మించుకున్నారు. భూసేరకణ చేస్తే కొత్తగా కట్టుకున్న ఇండ్లు కూడా కూల్చాల్సివస్తుందని వాపోతున్నారు. గ్రామస్తుల ఆందోళన నేపథ్యంలో సర్వీస్​రోడ్డు వెడల్పు కొంత తగ్గించాలని కలెక్టర్​ సూచించినట్టు తెలుస్తోంది. 

గ్రామ సభను బహిష్కరించి నిరసన

మిట్టపల్లిలో ఆర్వీబీ భూసేకరణ, పాత పరిహారాల చెల్లింపు కోసం మార్చి లో రెవెన్యూ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. గ్రామలో 104 మంది నుంచి 3.05 ఎకరాల భూమిని సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఈనెల 16 న గ్రామ సభ ఏర్పాటు చేయగా కొత్త నోటిఫికేషన్​ వల్ల విలువైన ఓపెన్ ప్లాట్లు, ఇండ్లు నష్టపోతున్నామంటూ గ్రామస్తులు నిరసన తెలిపారు.

సర్వీస్ రోడ్డు కోసం భూమి అవసరమైతే ఆర్వొబీ పేరిట ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చారని నిలదీశారు. నేషనల్​ హైవే పై ఆర్వొబీ అప్రోచ్​ రోడ్డును ఆర్ అండ్ బీ నిర్మించడం ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి, ఈ విషయంపై ఆర్ అండ్ బీ ఎఈ శ్రీకాంత్ ను వివరణ కోరగా డిజైన్ ప్రకారమే ఆర్వొబీని నిర్మిస్తున్నామని తెలిపారు.ఆర్వోబీ కి ఇరువైపులా సర్వీస్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్టు చెప్పారు. 

విలువైన ప్లాటు కోల్పోవాల్సి వస్తుంది

జీవితాంతం కష్టపడిన సంపాదించిన డబ్బులతో కొనుకున్న ప్లాటు రోడ్డు విస్తరణ లో కోల్పోవాల్సి వస్తోంది. రైల్వే ఓవర్ బ్రిడ్జి విస్తరణ వల్ల నాలాంటి పేదలకు అన్యాయం జరుగుతోంది. అధికారులు పునరాలోచన చేయాలి. 

గొట్టు హనుమంతు, మిట్టపల్లి

పేదలకు నష్టం జరగకుండా చూడాలి

మిట్టపల్లి వద్ద ఓవర్ బ్రిడ్జి, సర్వీస్ రోడ్డు వల్ల పేదలు నష్టపోకుండా చూడాలి. ఆర్వొబీ, సర్వీస్ రోడ్డుకు సంబంధించి అధికారులు ప్లాట్లు, ఇండ్లు కోల్పోతున్న వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి. 

చింతల శ్రీనివాస్, మిట్టపల్లి