తాడ్వాయి, వెలుగు: భారీ వర్షాలకు ములుగు జిల్లా తాడ్వాయి మండలం పడిగాపూర్, ఏలుబాక గ్రామాలు జలమయమయ్యాయి. కొంతమంది ప్రజలు జ్వరాల బారిన పడ్డారు. వైద్యం, నిత్యావసర సరుకుల కోసం గ్రామస్తులు సోమవారం జంపన్నవాగు వద్దకు వచ్చి నిరసన తెలిపారు. సమాచారం తెలుసుకున్న మండల స్పెషల్ ఆఫీసర్, డీఎంహెచ్వో అల్లెం అప్పయ్య, తహసీల్దార్ తోట రవీందర్, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రాసిటీ డిపార్ట్మెంట్ అధికారులు ఆయా గ్రామాలను సందర్శించారు.
హెల్త్ క్యాంప్ నిర్వహించి జ్వర బాధితులకు వైద్యం అందించారు. నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ రెండు గ్రామాల ప్రజల రవాణా సౌకర్యం కోసం బ్రిడ్జి మంజూరైందని డీఎంహెచ్వో అప్పయ్య తెలిపారు. విపత్తు సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.