
నర్సాపూర్, వెలుగు : టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ బుధవారం నామినేషన్ వేయడానికి భారీ ప్రదర్శనతో వెళ్తుండగా ట్రాఫిక్ జామ్ కావడంతో కలెక్టర్ వాహనం గంటసేపు రోడ్డుపైనే నిలిచింది. ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడం పైగా అబ్జర్వర్స్, పోలింగ్ స్క్వాడ్స్ దరిదాపుల్లో లేకపోవడంతో కలెక్టర్ రాజర్షి షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం తమాషా చేస్తున్నారా.. ఇంత హంగు ఆర్భాటంతో నామినేషన్ వేస్తుంటే ఆఫీసర్లు ఏం చేస్తున్నారని, అభ్యర్థి ప్రతి పైసా ను కౌంటింగ్ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు.
పబ్లిక్కు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పట్టణంలోని బీవీఆర్ఐటీ కాలేజ్లో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూములను పరిశీలించి భద్రత ఏర్పాట్లు చేయాలని ఆఫీసర్లకు సూచించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని 24 గంటలు సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట స్పెషల్ ఆఫీసర్లు ఆంజనేయులు ఉన్నారు.
మెదక్ టౌన్, వెలుగు : జిల్లాలో ఎన్నికల ప్రచారం అనుమతులు పొందేందుకు సువిధ యాప్ ద్వారా అప్లై చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. రాజకీయ పార్టీలు, సభలు, సమావేశాల కోసం వచ్చే అప్లికేషన్లను పరిశీలించి ఎన్నికల నిబంధనలకు లోబడి అనుమతులు మంజూరుచేస్తామన్నారు. దీంతో పాటు సీ- విజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులకు తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.