హిమాయత్ నగర్​లో హౌసింగ్ భూములపై ఆఫీసర్ల ఆరా

హిమాయత్ నగర్​లో హౌసింగ్ భూములపై ఆఫీసర్ల ఆరా
  • హౌసింగ్ సెక్రటరీ, ఎండీ రివ్యూ 
  • ఇందిరమ్మ ఇండ్లపైనా చర్చ 

హైదరాబాద్, వెలుగు: హౌసింగ్ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ, దక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్​ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (దిల్) పరిధిలోని భూములపై గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఈ నాలుగు సంస్థలకు సంబంధించిన సమగ్ర వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వీటిపై బుధవారం హైదరాబాద్​లోని హిమాయత్ నగర్​లో గృహ నిర్మాణ శాఖ సెక్రటరీ జ్యోతిబుద్ధ ప్రకాశ్, హౌసింగ్ బోర్డు, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయా సంస్థల అధికారులు పవర్ పాయింట్ ప్రజం టేషన్ ఇచ్చారు. అన్ని జిల్లాల్లో రాజీవ్ స్వగృహ భూములతో పాటు అపార్ట్​మెంట్లు ఉండగా, వాటిలో కొన్ని వేలంలో అమ్ముడయ్యాయి. మిగతావి ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి వేలంపై సమావేశంలో చర్చించారు. హౌసింగ్ బోర్డుకు హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో పెద్ద ఎత్తున కమర్షియల్ కాంప్లెక్స్​లు, ల్యాండ్స్ ఉన్నాయి.

వాటిని లీజుకు ఇచ్చారు. వాటి అద్దె, లీజు అమౌంట్​పై ఉన్నతాధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక దక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు దాదాపు 6 వేల ఎకరాల భూమి ఉండగా, వాటిపైనా ఆరా తీశారు. కాగా, త్వరలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను మొదలుపెట్టేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నదని అధికారులకు సెక్రటరీ, ఎండీ తెలిపారు. 

కార్పొరేషన్​లో ఉద్యోగ ఖాళీలపై చర్చ.. 

హౌసింగ్ కార్పొరేషన్​లో ఉద్యోగ ఖాళీలపైనా సమావేశంలో చర్చ జరిగినట్టు అధికారులు చెప్తున్నారు. డిప్యుటేషన్​పై వెళ్లిన కార్పొరేషన్​కు చెందిన అధికారులను మాతృశాఖకు తీసుకొస్తేనే ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్​ను అమలు సాధ్యమవుతుందని సెక్రటరీ, ఎండీలకు అధికారులు చెప్పారు. ఈ అంశాన్ని హౌసింగ్ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని సెక్రటరీ, ఎండీ తెలిపారు. కాగా, హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాశ్, ఎండీ వీపీ గౌతమ్​ను హౌసింగ్ ఇంజనీర్స్, వర్క్ ఇన్ స్పెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రఘువీర్ ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటరమణా రెడ్డి సన్మానించారు.