కరీంనగర్ టౌన్,వెలుగు: గ్రీవెన్ సెల్‌కు సోమవారం జనం పోటెత్తారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు భారీగా తరలివచ్చారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో కలెక్టర్ డాక్టర్ గోపి 303 ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల సమస్యలను పరిశీలించి సత్వరమే పరష్కరించాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్ మున్సిపల్ ఆఫీస్ 43, కరీంనగర్ రూరల్‌లో 19, కొత్తపల్లి తహసీల్‌లో 13, మానకొండూర్ తహసీల్‌లో 13, శంకరపట్నం తహసీల్‌లో 11 ఫిర్యాదులు రాగా మిగిలిన శాఖలకు 204 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, డీఆర్ఓ పవన్ కుమార్ , వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జగిత్యాల గ్రీవెన్స్‌కు ‘ డబుల్’ దరఖాస్తుదారులు
జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి డబుల్బెడ్రూం ఇండ్ల దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల నిర్వాహకంతో అర్హులకు ఇండ్లు రాలేదని ఆరోపించారు. పెద్దఎత్తున దరఖాస్తుదారులు రావడంతో కలెక్టర్ ప్రజావాణి ఆడిటోరియం బయట ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయించి ఫిర్యాదులు స్వీకరించారు.