ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలె : కలెక్టర్​ రాజర్షి షా

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలె : కలెక్టర్​ రాజర్షి షా

మెదక్ టౌన్, వెలుగు :  జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రాజర్షి షా అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్​లో వెబ్​కాస్టింగ్,​ సీసీ టీవీ కెమెరాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీ టీవీలు,  వెబ్​క్యాస్టింగ్​ ద్వారా ఓటింగ్ రికార్డ్ చేయాలని అధికారులను ఆదేశించారు.

సమస్యాత్మక పోలింగ్​ కేంద్రాలను గుర్తించి ఎన్నికల సిబ్బందికి ఎలాంటి సమస్యలు రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్​సీసీ వలంటీర్లను ఓటింగ్ పక్రియలో వినియోగించుకోవాలన్నారు. కౌంటింగ్ హాల్,  స్ట్రాంగ్ రూమ్​లు నిఘా పర్యవేక్షణలో ఉండాలన్నారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్లు రమేశ్, వెంకటేశ్వర్లు, డీపీవో సాయిబాబా, ఎన్ఐసీ ఈడీఎమ్​సందీప్, డీఎస్​వో రాజిరెడ్డి, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. 

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని కలెక్టర్ రాజర్షి షా ఆకాంక్షించారు. చెడుపైన మంచి సాధించిన విజయానికి ప్రతీకగ దీపావళి పండుగ జరుపుకుంటారన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.  పటాకులు కాల్చేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆనందంగా జరుపుకోవాలన్నారు. 

పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలె 

పటాన్​చెరు :  అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్​ ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. శనివారం పటాన్​చెరు రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని, అడిషనల్​ కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, సిబ్బందితో సమావేశమై నామినేషన్ల స్క్రూటినీ, పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లు, ఓటర్ స్లిప్పుల పంపిణీ, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, పోస్టల్ బ్యాలెట్ జారీ, తదితర అంశాలపై సమీక్షించి పలు సూచనలు చేశారు.

ఓటర్ స్లిప్పులను రేపటి నుంచి పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్ లిస్టు డౌన్లోడ్ చేసుకుని ప్రింటింగ్ కు ఇవ్వాలన్నారు. పోలింగ్ కేంద్రం వారీగా ఓటర్ లిస్టులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి అప్లికేషన్లు స్వీకరించి పోస్టల్ బ్యాలెట్ జారీ చేయాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు ఉండేలా చూసుకోవాలన్నారు.  పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలని, అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం పటాన్​చెరు మండలం, భానూర్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని  సందర్శించి వసతి సౌకర్యాలను పరిశీలించారు.

ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఉండాలని, దివ్యాంగులకు ర్యాంపు, వీల్ చైర్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీ  ఏర్పాట్లపై బిఎల్ఓ లను ఆరా తీశారు.  ఓటర్లందరూ నవంబర్ 30న కచ్చితంగా ఓటు వేసేలా చైతన్య పరచాలని సూచించారు. కలెక్టర్ వెంట అడిషనల్​ కలెక్టర్ చంద్రశేఖర్, డిప్యూటీ కలెక్టర్ మహిపాల్ రెడ్డి, రిటర్నింగ్ అధికారి దేవుజా పోలీస్ అధికారులు ఉన్నారు.