సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి : బదావత్ సంతోష్

నస్పూర్, వెలుగు: జిల్లాలో చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులు మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణపై బుధవారం నస్పూర్​లోని కలెక్టరేట్​​లో అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) సబావత్ మోతిలాల్​తో కలిసి జిల్లాలోని తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాకు సంబంధించి రాష్ట్రస్థాయి, ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, దరఖాస్తు అందిన వారం రోజుల్లోగా పరిష్కరించేలా కృషి చేయాలన్నారు.

ధరణి పోర్టల్​లో నమోదైన భూ సంబంధిత విషయాలపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరపాలని, దరఖాస్తులను 3 క్యాటగిరీలుగా విభజించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. రహదారులు, ప్రాజెక్టుల నిర్మాణం ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన భూ సేకరణకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కోసం అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక చేయాలన్నారు. వీటితోపాటు పలు అంశాలపై చర్చించి పలు సూచనలు, సలహాలు అందించారు. మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీఓలు రాములు, హరికృష్ణ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.