
చేర్యాల, వెలుగు: చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని దేవాదుల 8 ఆర్ కాలువ కొత్త డిజైన్‌ను నిరసిస్తూ రైతులు వారం రోజులుగా ఆందోళనలు చేస్తుండడంతో అధికారులు స్పందించారు. శుక్రవారం దేవాదుల డీఈ రుద్ర, జేఈ స్మిత కెనాల్ ఓటీ, ముస్త్యాల శివారులో గతంలో తవ్విన కాలువను పరిశీలించారు. కాలువపై ఉన్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలో ఉన్నత స్థాయిలో పనిచేసిన ఒక అధికారి సిఫార్సు మేరకు గతంలో డిజైన్ మార్చినట్లుగా ఫోన్‌లో మాట్లాడడం అనుమానాలకు తావిస్తోంది.
కొందరు రియల్టర్ల ఒత్తిడి మేరకే డిజైన్ మార్చారని స్థానిక రైతులు అధికారులకు తెలిపారు. పాత డిజైన్ ప్రకారం కాలువ నిర్మాణం చేపడితే ఒక్క రైతుకు కూడా ఇబ్బంది ఉండదని, కొత్త డిజైన్ వల్ల భూములు కోల్పోవాల్సి వస్తోందని వివరించారు. త్వరలోనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేస్తామని డీఈ రుద్ర హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు కొంతం మల్లేశం, శ్రీను, బత్తెపు లింగం, బీర్ల నర్సయ్య, రవి, మహేశ్, దాసరి అనిల్, పిల్లి వెంకటేశం పాల్గొన్నారు.