- మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఇస్తేనే భూములిస్తాం
- అధికారులకు తెగేసి చెబుతున్న రైతులు
- చట్ట ప్రకారం ఎకరాకు రూ.16లక్షల నుంచి రూ. 20 లక్షలు ఇస్తామంటున్న ఆఫీసర్లు
- పరిహారం తేల్చకుండా సర్వే చేయడంపై రైతుల ఆగ్రహం
పెద్దపల్లి, వెలుగు:- మంచిర్యాల– భూపాలపల్లి–వరంగల్ హైవే నిర్మాణానికి పెద్దపల్లి జిల్లాలో భూసేకరణ చేపట్టిన అధికారులకు రైతుల నుంచి వ్యతిరేకత ఎదురువుతోంది. పరిహారం తేలకుండా భూములిచ్చేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. అది కూడా మార్కెట్ వ్యాల్యూ ప్రకారం చెల్లిస్తేనే ఇస్తామంటూ తేల్చిచెబుతున్నారు. మరోవైపు హైవే నిర్మాణానికి అవసరమైన భూసేకరణను స్పీడప్ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
దీంతో పరిహారం తేల్చకుండానే పొలాల్లో సర్వే చేస్తుండడంతో రైతులు మండిపడుతున్నారు. చట్టప్రకారం ఎకరాకు రూ.16లక్షల నుంచి రూ.20లక్షలే చెల్లిస్తామని అధికారులు లీకులు ఇవ్వడంపై రైతులు ఫైర్ అవుతున్నారు. ఇదంతా అధికారుల మైండ్ గేమ్ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మార్కెట్ వ్యాల్యూ ఇవ్వాలని రైతుల డిమాండ్
మంచిర్యాల నుంచి భూపాలపల్లి మీదుగా వరంగల్ వరకు నిర్మిస్తున్న హైవే పెద్దపల్లి జిల్లాలో 38.07 కి.మీ ఉండనుంది. మంథని, రామగిరి, ముత్తారం మండలాల్లోని 16 గ్రామాల పరిధిలో సుమారు 493 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉంది. దీనికి గానూ ప్రభుత్వం చట్ట ప్రకారం పరిహారం ఇస్తామని అధికారులు చెప్తున్నారు. మార్కెట్ వ్యాల్యూ ప్రకారం జిల్లాలో ఎకరాకు రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షల పైనే ఉంది. అధికారులు మాత్రం చట్టప్రకారం ఎకరానికి రూ. 16 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.
చట్ట ప్రకారం పరిహారం చెల్లిస్తే తాము తీవ్రంగా నష్టపోతామని, మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ.30లక్షలు ఇస్తేనే భూములు ఇస్తామని రైతులు తేల్చిచెబుతున్నారు. అధికారులు భూసేకరణ పనులు స్పీడప్ చేయగా పరిహారం తేల్చకుండా సర్వే ఎలా చేస్తారని రైతులు ఫైర్అవుతున్నారు. అలాగే చేపట్టిన సర్వేలో తప్పులున్నాయని, ఎకరం పోతుండగా, 20 గుంటలుగా లెక్కజేసి పరిహారం ఇస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోసారి సర్వే చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అధికారులు మాత్రం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సర్వే చేసి లాండ్ సేకరణ చేస్తామని, దానికి సంబంధించిన పరిహారం ల్యాండ్ అథారిటీ ఖాతాలో జమ చేస్తామంటున్నారు. అభ్యంతరాలుంటే అథారిటీలోనే తేల్చుకోవాలని అధికారులు చెప్తున్నారు. ఒకవైపు అధికారులు సర్వే పూర్తయిందని చెప్పినా కూడా, రైతులు మాత్రం పరిహారం అందకుండా భూములు హ్యాండోవర్ చేయమని చెప్తున్నారు. రైతుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడడానికే అధికారులు మైండ్‌గేమ్ ఆడుతున్నారని పలువురు నిర్వాసిత రైతులు ఆరోపిస్తున్నారు.
లబ్ధిదారులకు ధరణి ఎఫెక్ట్..
హైవే నిర్మాణంలో పోతున్న రైతులకు ధరణి పోర్టల్ వల్ల తీవ్ర నష్టం జరుగుతోంది. ధరణిలో నమోదైన భూములకు పరిహారం ఇస్తామని అధికారులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో హైవేలో పోతున్న 493 ఎకరాల్లో దాదాపు 200 ఎకరాలకు సంబంధించి పట్టదారుల పేరు ధరణిలో నమోదు కాలేదు. దీంతో సంబంధిత రైతులు ఆందోళనకు చెందుతున్నారు.
ఆర్భిట్రేషన్ తర్వాత రూ. 20 లక్షలు ఇస్తాం
రైతులతో సమావేశం ఏర్పాటు చేసి పరిహారంపై అవగాహన కల్పించాం. చట్ట ప్రకారం భూమి కోల్పోతున్న రైతులకు పరిహారం ఇస్తాం. కలెక్టర్ ఆర్బిట్రేషన్ తర్వాత ఎకరాకు రూ. 16 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు పరిహారంగా ఇస్తామని రైతులకు చెప్పాం.
శ్యాంప్రసాద్ లాల్, పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్
78 గుంటలకు 34 గుంటలే అంటున్నరు
హైవే కింద నా భూమి 1 ఎకరం 38 గుంటలు పోతుండగా, 34 గుంటలే తన భూమిగా చెప్తున్నారు. దాని వల్ల 1 ఎకరం 4 గుంటలు నష్టపోతున్నాను. రీసర్వే చేసి నాకు న్యాయం చేయాలే. అలాగే ఎకరానికి రూ. 30 లక్షలు ఇస్తేనే భూములిస్తాం.
ఎట్టెం సంపత్‌రావు, ఓడెడ్, పెద్దపల్లి జిల్లా