ఆస్పత్రులలో మెరుగైన ట్రీట్​మెంట్​ అందించాలి : కలెక్టర్లు

  • వివిధ జిల్లాల కలెక్టర్లు
  • ప్రభుత్వ ఆస్పత్రులను తనిఖీ చేసిన అధికారులు
  • వైద్య సేవలు, మౌలిక వసతులపై ఆరా
  • సీజనల్​వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచన

వర్ధన్నపేట / గూడూరు / భూపాలపల్లి రూరల్​/ కమలాపూర్​/ నల్లబెల్లి, వెలుగు: విధులను నిర్లక్ష్యం చేస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఆయా జిల్లాల కలెక్టర్లు డాక్టర్లను హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాలోని పలు ఆస్పత్రులను కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, వసతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులకు పలు సూచనలు చేశారు. 

వరంగల్​జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్​సత్యశారదాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న భోజనాన్ని తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ గైనకాలజిస్ట్ డాక్టర్ ఒక్కరే ఉన్నారని, ఆమె సరిగా రావడం లేదని, నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామన్నారు. డాక్టర్లందరూ రోజు హాజరు కావాలన్నారు. జనరేటర్​ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఓపీలను ఆన్​లైన్​లో నమోదు చేయాలన్నారు. 

సరిపడా మందులు ఉంచుకోవాలి

ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్నందున, రోగులకు సరిపడా మందులను సిద్ధంగా ఉంచుకోవాలని మహబూబాబాద్​కలెక్టర్​అద్వైత్​కుమార్​సింగ్​సూచించారు. గూడూరు సీహెచ్​సీని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిని పరిశీలించి, సీజనల్​వ్యాధులపై చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఏఎన్​ఎం, ఆశ వర్కర్లు ఇంటింటి సర్వే చేయాలన్నారు. నార్మల్​డెలివరీలను ప్రోత్సహించాలని చెప్పారు. ఆస్పత్రి సిబ్బంది వివరాలు, ఇన్, అవుట్ పేషెంట్ల వివరాలు తెలుసుకున్నారు. ఆయనవెంట సూపరింటెండెంట్​ వీరన్న, డాక్టర్ వెంకట రమణ ఉన్నారు. 

మెరుగైన ట్రీట్మెంట్ అందించాలి

హాస్పిటల్ కు వచ్చే పేషెంట్లకు మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ డాక్టర్లను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. క్యాజువాలిటి, బ్లడ్ బ్యాంక్, ప్రసూతి వార్డు, లేబర్ రూమ్, ప్లేట్ లెట్ మిషన్, ఐసీయూ, జనరల్ వార్డులను పరిశీలించి వైద్య సేవలపై ఆరా తీశారు. వైరల్ జ్వరాలతో ఆసుపత్రికి వస్తున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనవెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సిబ్బంది నియామకానికి కృషి చేస్తా..

ఆస్పత్రిలో శిక్షణ పొందిన సిబ్బంది లేకపోవడంతో స్కానింగ్, ఎక్స్​రే యంత్రాలు నిరుపయోగంగా ఉన్నాయని, సిబ్బంది నియామకంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హనుమకొండ జిల్లా అడిషనల్​కలెక్టర్​వెంకట్​రెడ్డి అన్నారు. బుధవారం ఆయన హనుమకొండ కమలాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ప్రస్తుతం ముగ్గురు డెంగ్యూతో చికిత్స పొందుతుండగా, 17 మంది వివిధ వ్యాధులతో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. కాగా, కమలాపూర్ మండలంలో వీధికుక్కల బెడద ఎక్కువగా ఉందని ప్రజలు ఆయన దృష్టికి తీసుకురాగా, పరిష్కరానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 
వసతులు లేవు.. రూల్స్​పాటించరు

ఆస్పత్రుల్లో వసతులు లేవు, క్యాలిఫికేషన్ లేదు, రేట్ల వివరాలు కనిపించవు, ప్రభుత్వ రూల్స్ పాటించరు, మీ ఇష్టం ఉన్నట్లు నడుపుతారా అంటూ వరంగల్ డిప్యూటీ డీఎంహెచ్​వో ప్రకాశ్​యాజమాన్యాలపై ఫైర్​ అయ్యారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని పలు ఆస్పత్రులను ఆయన తనిఖీ చేశారు. తనిఖీల్లో నల్లబెల్లి మెడికల్ ఆఫీసర్ రవీందర్​నాయక్, విద్యాసాగర్​రెడ్డి, వీసీఎం రవీందర్, మహత్, కిషన్ పాల్గొన్నారు.