వార్ వన్ సైడేనా .. కౌంటింగ్​కు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు

వార్ వన్ సైడేనా .. కౌంటింగ్​కు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు
  • ఖమ్మం పార్లమెంట్ స్థానానికి 17 సార్లు జరిగిన ఎన్నికల్లో 11 సార్లు కాంగ్రెస్ దే గెలుపు 
  • ఇయ్యాల్నే ఫలితాలు.. 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్​
  • మరోసారి విజయంపై ‘హస్తం’ ఆశలు 
  • సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలనిబీఆర్ఎస్​తపన
  • ఓట్ల శాతాన్ని పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నం

ఖమ్మం, వెలుగు : పార్లమెంటు ఎన్నికల్లో మూడు వారాల కింద ఓటర్లిచ్చిన తీర్పు కాసేపట్లో బయటకు రానుంది. ఖమ్మంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీ పోటీపడ్డాయి. ఈ స్థానానికి గతంలో 17 సార్లు ఎన్నికలు జరగగా, 11 సార్లు కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. మరి మరోసారి చరిత్రను కాంగ్రెస్ రిపీట్ చేసి వార్​ వన్​సైడ్​ అని నిరూపిస్తుందా..? లేక గత ఎన్నికల్లో బోణీ కొట్టిన బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు నిలబెట్టుకుంటుందా అనేది సస్పెన్స్ గా మారింది. కాంగ్రెస్​ తరఫున మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి బరిలో ఉండగా, బీఆర్ఎస్​ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు మరోసారి పోటీపడుతున్నారు. 

బీజేపీ తరఫున తాండ్ర వినోద్​ రావు పోటీ చేశారు. కాంగ్రెస్​ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తూంటే, సిట్టింగ్​ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే తపనలో బీఆర్​ఎస్​ఉంది. బీజేపీ ఏ మేరకు యఓట్లు పెంచుకుంటుందనేది కూడా చూడాలి. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 16,31,039 మంది ఓటర్లకు గాను 12,41,135 మంది ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. 76.09 శాతం ఓటింగ్ నమోదైంది. 

ఏర్పాట్లు ఇలా.. 

ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు రూరల్​ మండలంలోని పొన్నెకల్​ లో ఉన్న శ్రీచైతన్య ఇంజినీరింగ్ కాలేజీలో జరగనుంది. ఉదయం 4 గంటల కల్లా కౌంటింగ్ విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది కేంద్రానికి హాజరుకావాల్సి ఉంటుంది. ఏ టేబుల్ దగ్గర ఎవరు డ్యూటీ చేయాలనే విషయాన్ని ఉదయం 5 గంటలకు ఆఫీసర్లు తెలియజేస్తారు. కౌంటింగ్ కు ముందు అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్​ లను తెరుస్తారు. ఉదయం 8 గంటలకు పోస్టల్​ బ్యాలట్​ తో పాటు ఈవీఎంలోని ఓట్ల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. 

అసెంబ్లీ నియోజకవర్గాలకు 14 టేబుళ్ల చొప్పున, ఖమ్మం అసెంబ్లీకి 18 టేబుళ్లను అమర్చుతారు. అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను బట్టి ఎన్ని రౌండ్లు ఉంటాయో నిర్ణయిస్తారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓట్ల లెక్కింపు 20 రౌండ్లలో పూర్తి కానుంది. పాలేరు అసెంబ్లీకి 21 రౌండ్లు, మధిర 19 రౌండ్లు, సత్తుపల్లి 21 రౌండ్లు, వైరా 18 రౌండ్లు, కొత్తగూడెం 18 రౌండ్లు, అశ్వారావుపేట 13 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. పోలింగ్ కేంద్రాల క్రమసంఖ్య ఆధారంగా ఒక్కో టేబుల్​ కు ఒక్కో కంట్రోల్​ యూనిట్ ను కేటాయిస్తారు. ఒక్కో టేబుల్ పై ఒక్కో కంట్రోల్ యూనిట్ నుంచి ఓట్లను లెక్కిస్తారు.

 టేబుళ్లపై ఉన్న కంట్రోల్​ యూనిట్లలోని ఓట్ల లెక్కింపు పూర్తయితే దాన్ని ఒక్క రౌండ్ గా భావిస్తారు. ఈ ప్రాసెస్​ మొత్తం సుమారు అరగంట పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కౌంటింగ్ అధికారులు, అభ్యర్థి తరఫున ఏజెంట్ల సమక్షంలో ఈ ప్రాసెస్​ జరుగుతుంది. కౌంటింగ్ కేంద్రంలో ఆర్​ వో, అడిషనల్​ రిటర్నింగ్ అధికారులు కాకుండా ఒక్కో టేబుల్ కు ముగ్గురు చొప్పున అధికారులు ఉంటారు. 

కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్..  

లోకసభ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ సునీల్ దత్ తెలిపారు. జనాలు  గుమికూడి ఉండరాదని, ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు. విజయోత్సవాలు, సంబురాలు నిర్వహించొద్దని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా  ఎటువంటి అవాంఛనీయ ఘటనలు  జరగకుండా అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు  సహకరించాలని కోరారు. 

 ఖమ్మం కమిషనరేట్ పరిధిలో 24 గంటల పాటు మద్యం విక్రయాలను నిలిపివేయాలని సీపీ ఆదేశించారు. వైన్ షాపులు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు మూసివేయాలని చెప్పారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.