
- జిల్లాలో 664 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
- ఇప్పటికే ప్రారంభమైన వరి కోతలు
- 'ఏ'గ్రేడ్ వడ్లు క్వింటాల్ మద్దతు ధర రూ.2,320
- సాధారణ వడ్లు క్వింటాల్ ధర రూ.2,300
- సన్నాలకు రూ.500 బోనస్
- 9 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల సేకరణకు టార్గెట్
నిజామాబాద్, వెలుగు : వరి ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం అంతా సిద్ధం చేసింది. జిల్లావ్యాప్తంగా 664 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా, బోధన్ పరిధిలో నేటి నుంచి ప్రారంభించనున్నారు. యాసంగి సీజన్లో 5.18 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగు కాగా, రికార్డుస్థాయిలో 4.19 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 11.85 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయఅధికారులు అంచనా వేశారు. అందులో 9 లక్షల టన్నులను కొనుగోలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.
సన్నాలు 6.80 లక్షల టన్నులు కాగా, దొడ్డు రకం 2.20 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించేందుకు ప్రణాళిక రూపొందించారు. గత యాసంగిలో అనుకున్న లక్ష్యాన్ని వ్యవసాయ శాఖ చేరుకోలేకపోయింది. పార్లమెంట్ ఎన్నికలు ఉండడం వల్ల అతికష్టం మీద 3.85 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఆహార భద్రత స్కీమ్ కింద రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యమే ఇవ్వనున్నది.
దీంతో సన్న రకం వడ్లకు మంచి డిమాండ్ ఉంది. గతంలో కంటే ఈసారి మూడు వారాల ముందే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతున్నాయి. ‘ఏ’ గ్రేడ్ వడ్లకు మద్దతు ధర రూ.2320 చెల్లించనుండగా, సాధారణ రకం క్వింటాల్‌కు రూ.2300 చెల్లించనున్నారు. సెంటర్లలో 17 శాతం తేమను అనుమతించనున్నారు. సన్న రకం వడ్లకు రూ.500 బోనస్ లభించనున్నది.
వారం నుంచే వరి కోతలు
జిల్లాలో వరి కోతలు వారం నుంచే ప్రారంభమయ్యాయి. నిజాంసాగర్ ప్రాజెక్టుకు చేరువలో ఉన్న బోధన్ డివిజన్ పరిధిలో వరినాట్లు ముందుగా వేయడం వల్ల తొందరగా పంట చేతికొచ్చింది. పచ్చి వడ్లను కొన్న మిల్లర్లు క్వింటాల్‌కు రూ.2 వేలు చెల్లించి రైతులను మోసం చేశారు. మరో రెండు నెలలు ధాన్యం కొనుగోళ్ల హడావుడి సాగనున్నది.
గతంలో ఇబ్బందులు..
గతంలో కోతలు మొదలైన నెల తర్వాత కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యేవి. 40 శాతం ధాన్యాన్ని ప్రైవేటు మిల్లర్లకు ఇచ్చేవారు. తరుగుతోపాటు కంటా దోపిడీ, ధర తక్కువతో అన్నదాతలు నష్టపోయేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం ముందే కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర అందించనుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఫిర్యాదులు రావద్దు..
జిల్లాలో గురువారం నుంచి ప్రారంభమయ్యే వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు మండల ఆఫీసర్లకు సూచించారు. బుధవారం నిర్వహించిన మీటింగ్‌లో కలెక్టర్ మాట్లాడారు. కొనుగోలు సెంటర్ల వద్ద టెంట్లు వేయడంతో పాటు తాగునీరు వసతి కల్పించాలన్నారు. సరిపడా గన్నీ బ్యాగ్‌లను అందుబాటులో ఉంచాలన్నారు. మిల్లుల్లో బస్తాలు అన్లోడ్ అయ్యేలా లారీలు, హమాలీలను రెడీగా పెట్టుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత మండల అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఇలా..
సింగిల్ విండోలు 481 సెంటర్లు
ఐకేపీ 107
ఐడీసీఎంఎస్ 68
మెప్మా 8