
- చెల్లని ఓట్లు, చెల్లుబాటయ్యే ఓట్లను గుర్తించడంలో లేట్
- గ్రాడ్యుయేట్ కౌంటింగ్ తేలేది రేపే?
- నేటి సాయంత్రానికి కేవలం ఫస్ట్ప్రయారిటీ ఓట్లే..?
కరీంనగర్, వెలుగు: కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల ఫలితాల కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తుంటే.. అధికారులు మాత్రం కౌంటింగ్ ప్రక్రియ ను మందకొడిగా కొనసాగించడం అసహనానికి గురి చేసింది. నల్లగొండలోలాగే కరీంనగర్ లోనూ సోమవారం ఉదయం 8 గంటలకు టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో పోలైన ఓట్లను కట్టలు కట్టడం ప్రారంభించినప్పటికీ ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు సాయంత్రం అయింది. నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో కౌంటింగ్ ఫస్ట్, సెకండ్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవరకు కూడా కరీంనగర్ లో కౌంటింగ్ మొదలుకాలేదు.. చెల్లని ఓట్లు, చెల్లుబాటయ్యే ఓట్లను గుర్తించడంలో చాలా టైం తీసుకోవడంపై పలువురు అభ్యర్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఫస్ట్ ప్రయార్టీ ఓట్లతోనే బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలవడంతో సోమవారం రాత్రి వరకే విజేతను ప్రకటించగలిగారని, ఒకవేళ సెకండ్ ప్రయార్టీకి వెళ్లాల్సి వస్తే మంగళవారం తెల్లవారుజామైనా కౌంటింగ్ పూర్తయ్యేది కాదని పలువురు ఏజెంట్లు వెల్లడించారు. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లెక్కింపు మంగళవారం తేలే అవకాశం లేదు. కేవలం ఫస్ట్ ప్రయారిటీ లెక్కింపు పూర్తవయ్యే అవకాశం ఉండగా.. పూర్థి స్థాయి రిజల్ట్ కోసం బుధవారం వరకు వేచిచూడాల్సిందే.
21 టేబుళ్లు గ్రాడ్యుయేట్లకు.. 14 టేబుళ్లు టీచర్లకు..
గ్రాడ్యుయేట్ ఓట్లు 3.55 లక్షలకుగానూ 2,50,106 ఓట్లు పోలవ్వగా, టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 27,088 ఓటర్లకుగానూ 24,895 ఓట్లు పోలైన విషయం తెలిసిందే. లెక్కింపు కోసం 35 టేబుళ్లు వేయగా.. అందులో 21 టేబుళ్లు గ్రాడ్యుయేట్లకు, 14 టీచర్ల కోసం కేటాయించారు. మొత్తం 800 మంది సిబ్బంది లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్నారు. 20 శాతం రిజర్వు సిబ్బంది కూడా ఉన్నారు. ఒకరోజు ముందు మాక్ కౌంటింగ్ నిర్వహించినా.. చివరికి అసలు కౌంటింగ్ ప్రారంభించాక కౌంటింగ్ లో వెనకబడిపోయారనే విమర్శలు వినిపించాయి.
దీంతో రాత్రి 8 గంటలు దాటినా.. ఇటు టీచర్, అటు గ్రాడ్యుయేట్ ఓట్లకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. సాయంత్రం తర్వాత టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటికే ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల ట్రెండ్ ను గమనించిన బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య, ఆయన అనుచరులు ఫలితాల ప్రకటనకు ముందే రాత్రి 7 గంటలకే సంబురాలకు సిద్ధమయ్యారు.
టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కలో గందరగోళం
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగినప్పటి నుంచి పోలైన ఓట్ల లెక్కను మూడు సార్లు మూడు రకాలుగా ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ జరిగిన ఫిబ్రవరి 27న మొత్తం 24,895 ఓట్లు పోలవ్వగా అందులో 15,743 మంది పురుషులు, 9,152 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. మరుసటి రోజు ఫిబ్రవరి 28న 24,968 ఓట్లు పోలయ్యాయని, వీరిలో 15,809 మంది పురుషులు, 9159 మంది మహిళలు ఉన్నారని వెల్లడించారు. ఇదే ఫైనల్ ఫిగర్స్ అని ప్రకటించారు. సోమవారం రాత్రి కౌంటింగ్ పూర్తయ్యాక మొత్తం పోల్ అయిన ఓట్ల లెక్కను 25,041గా ప్రకటించడం గమనార్హం.