ఆయిల్​పామ్​పై ఆసక్తి!

  • ఎకరానికి ఏటా లక్ష రూపాయల ఆదాయం 
  • సబ్సిడీపై డ్రిప్​లు, ప్రోత్సాహకాలు ఇస్తున్న సర్కారు  
  • ఈ ఏడాది 2,442 ఎకరాలకు 800 ఎకరాల్లో సాగు  
  • ఐదేండ్లకు దిగుబడి.. అప్పటివరకు అంతర పంటలు


మంచిర్యాల,వెలుగు: పత్తి, వరి పంటలకే పరిమితమైన రైతులు ఆయిల్​పామ్​ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తుండడంతో అటువైపు మొగ్గుతున్నారు. ఇతర పంటలతో పోల్చితే దీనికి పెట్టుబడి ఖర్చులు, రిస్క్​ తక్కువ. ఎకరానికి ఏటా రూ.లక్షకు పైగా ఆదాయం వస్తుంది. ప్రస్తుతం మన దేశంలో నూనెగింజల కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్​ వంటి దేశాల నుంచి పామాయిల్​ను దిగుమతి చేసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఆయిల్​పామ్​ సాగును పెంచడం ద్వారా రానున్న రోజుల్లో నూనెగింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. ఈ నేపథ్యంలో ఆయిల్​పామ్​ సాగును ప్రోత్సహిస్తోంది. 

ఈ ఏడాది లక్ష్యం 2,442 ఎకరాలు... 

జిల్లాలో ఆయిల్​పామ్​ సాగును 2019–20లో చెన్నూర్​ నియోజకవర్గంలో పైలట్​ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఆ సంవత్సరం 280 ఎకరాల్లో మాత్రమే నాటారు. 2021–22లో జిల్లావ్యాప్తంగా 2,442 ఎకరాల టార్గెట్​కు గాను ఇప్పటికే 800 ఎకరాల్లో సాగైంది. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేస్తామని హార్టికల్చర్​ ఆఫీసర్లు చెప్తున్నారు. చెన్నూర్​, కోటపల్లి, జైపూర్​, భీమారం, హాజీపూర్​, లక్సెట్టిపేట మండలాల రైతులు ఈ పంటపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. రానున్న రోజుల్లో నస్పూర్​, మంచిర్యాల మినహా ఇతర అన్ని మండలాల్లో ఆయిల్​పామ్​ సాగు విస్తీర్ణం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నారు.  

ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం...  

ఆయిల్​పామ్​ సాగు రైతులకు ఎంతో లాభదాయకం. ఈ మొక్కలు నాటిన తర్వాత ఐదో సంవత్సరం నుంచి దిగుబడినిస్తాయి. అప్పటివరకు కూరగాయలతో పాటు ఇతర అంతరపంటలు వేసుకోవచ్చు. అధికారులు సూచించిన సస్యరక్షణ చర్యలు పాటిస్తే ఎకరానికి 8 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుంది. టన్నుకు కనీసం రూ.10వేల చొప్పున రూ.లక్ష ఆదాయం గ్యారంటీ. ఈ పంట సాగుకు పెట్టుబడులు, రిస్క్​ చాలా తక్కువ. ఇతర పంటల్లాగా కోతులు, అడవిపందులు, పక్షుల బెడద ఉండదు. ప్రకృతి విపత్తులను సైతం తట్టుకుని నిలుస్తుంది. సుమారు 35 సంవత్సరాల దాకా ఒకే రకమైన దిగుబడులు వస్తాయి.  

సబ్సిడీపై డ్రిప్​లు, సర్కారు ప్రోత్సాహకాలు...  

సాగుకు నీటి వసతి తప్పనిసరి. వర్షాలు పడ్డప్పుడు తప్ప మూడు కాలాల్లోనూ నీరందించాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వం సబ్సిడీపై డ్రిప్​ యూనిట్లను మంజూరు చేస్తోంది. డ్రిప్​లపై ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం, బీసీలకు 90 శాతం, ఓసీలకు 80 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఈ ఏడాది జిల్లాలో 938 డ్రిప్​లకు ప్రభుత్వం  పరిపాలనా అనుమతులు వచ్చాయి. ఇందులో 631 యూనిట్లు మంజూరు కాగా, 428 యూనిట్లను ఇన్​స్టాల్​ చేశారు. ఆయిల్​పామ్​ మొక్కలు ఎకరానికి 57 నాటాలి. వీటిని కోస్టారికా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఒక్కో మొక్కకు ప్రభుత్వం రూ.193 చెల్లిస్తుండగా, రైతులు రూ.20 చొప్పున భరించాలి. మొక్కలు నాటిన తర్వాత నాలుగు సంవత్సరాల పాటు ఎకరానికి రూ.4,200 ప్రభుత్వం చెల్లిస్తుంది. జాబ్​ కార్డు ఉన్న రైతులకు ఉపాధిహామీ పథకం ద్వారా కూలీ చెల్లిస్తారు. 

రెండేండ్లలో పామాయిల్​ ఇండస్ట్రీ...

జిల్లాలో ప్లాంటేషన్​, ఇండస్ట్రీని ప్రభుత్వం మ్యాట్రిక్స్ కంపెనీకి అప్పగించింది. మొక్కల దిగుమతి మొదలు ఆయిల్ తీయడం వరకు ఈ కంపెనీయే చూసుకుంటుంది. ఇప్పటికే జిల్లాకు పామాయిల్ ఇండస్ట్రీ మంజూరైంది. దీనిని జైపూర్​ లేదా భీమారం మండలాల్లో ఏర్పాటు చేయనున్నారు. మరో రెండేండ్లలో ఈ ఇండస్ర్టీ అందుబాటులోకి వస్తుందని అధికారులు అంటున్నారు. మ్యాట్రిక్స్​ కంపెనీయే ఆయిల్​పామ్​ గెలలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి పామాయిల్​ను ఉత్పత్తి చేస్తుందని చెప్తున్నారు. 

రైతులకు లాభదాయకం... 

ఆయిల్​పామ్​ సాగు రైతులకు ఎంతో లాభదాయంగా ఉంటుంది. ప్రభుత్వం మొక్కలు, డ్రిప్​పైన సబ్సిడీలు ఇవ్వడంతో పాటు నాలుగేండ్ల పాటు ఎకరానికి రూ.4,200 చెల్లిస్తుంది. ఈ పంటకు కోతులు, పందులు, పక్షుల బెడద, ప్రకృతి విపత్తులతో నష్టం ఉండదు. ఐదో సంవత్సరం నుంచి గెలలు చేతికొస్తాయి. ఎకరానికి రూ.లక్ష ఆదాయం వస్తుంది. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 2,442 ఎకరాలకు గాను ఇప్పటికే 800 ఎకరాల్లో మొక్కలు నాటాం. మరింత మంది రైతులు ముందుకు రావాలి. - సహజ, జిల్లా ఇన్​చార్జి హార్టికల్చర్ ఆఫీసర్​