
- నిర్మల్ జిల్లాలో 2019 లో 3500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు
- ఫ్రీయూనిక్ ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభమే కాలే
- కంపెనీకి షోకాజు నోటీసులు జారీ చేసిన జిల్లా హార్టికల్చర్ అధికారులు
- సందిగ్ధంలో ఆయిల్ పామ్ రైతులు
నిర్మల్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయిల్ పామ్ పంట సాగు చేయగా కొనుగోలు విషయంలో సందిగ్ధత నెలకొంది. 2019 లో రాష్ట్రంలో ఈ పంట సాగు ను ప్రారంభించారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 10వేల ఎకరాల్లో దశల వారీగా ఆయిల్ పామ్ పంటను సాగు చేయాలనే లక్ష్యంతో స్టార్ట్ చేయగా.. మొదటి దశలో 3,500 ఎకరాల్లో సాగు చేశారు. రాబోయే జూన్‌లో మొదటి దశ పంట చేతికి రానుంది. అయితే ఈ పంటను ఎక్కడ అమ్ముకోవాలో అనే విషయంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగును, కొనుగోలు బాధ్యతను 'ఫ్రీ యూనిక్' అనే కంపెనీ తీసుకుంది. సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడు, పాక్ పట్ల వద్ద ఈ కంపెనీ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని నిర్మించడానికి ఒప్పుకుంది. 2023లో, ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 2023 అక్టోబర్ 4న ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ కూడా పాల్గొన్నారు.అయితే, ఇప్పటివరకు ఈ ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో రైతుల ఆందోళన మొదలైంది.
ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కంపెనీ ఏ పనులు ప్రారంభించకపోవడంతో జిల్లా హార్టికల్చర్ అధికారులు కంపెనీకి షోకాజు నోటీసులు జారీ చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం కాకపోవడంతో తమ పంటను ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు, ఫ్రీ యూనిక్ కంపెనీకి ఆయిల్ పామ్ పంట కొనుగోలు చేయాలని ఆదేశించారు. అలాగే, పంట సాగిస్తున్న ప్రాంతాల్లో ఫ్లెక్సీ బ్యానర్లతో ప్రచారం చేపట్టాలని సూచించారు.
పంట కొనుగోలు పై స్పష్టత లేదు..
హార్టికల్చర్ అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో ఆయిల్ పామ్ పంటను సాగు చేశాం. కొద్ది రోజుల్లోనే పంట చేతికి రాబోతోంది. స్థానికంగా ఎక్కడ కూడా పంట కొనుగోలు చేసే అవకాశం లేదు. మొదట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ని నిర్మించే కంపెనీ పంటను కొనుగోలు చేస్తానని చెప్పింది. కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయలేదు.- వేలాల గంగారెడ్డి, రైతు, గుండంపల్లి,మండలం దిలావర్పూర్.
ప్రభుత్వం పంట కొనుగోలు చేయాలి
ఐదు ఎకరాలలో ఆయిల్ ఫామ్ పంటను సాగు చేశాను. రెండు మూడు నెలల్లో పంట చేతికి వస్తోంది. ఇప్పటివరకు పంట కొనుగోలుపై కంపెనీ నుంచి అధికారుల నుంచి స్పష్టత రాలేదు. హార్టికల్చర్ అధికారులు ఆయిల్ పామ్ పంట కొనుగోలుపై హామీని నిలబెట్టుకోవాలి. పంట కొనుగోలు పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.-కొమ్ముల బుచ్చారెడ్డి, రైతు, గ్రామం గుండంపల్లి, దిలావర్పూర్