రూ. 17,043కు పెరిగిన పామాయిల్ గెలల ధర

రూ. 17,043కు పెరిగిన పామాయిల్ గెలల ధర
  • దిగుమతి సుంకాన్ని 5.5 నుంచి 27.5 శాతానికి పెంచిన కేంద్రం
  • మంత్రి తుమ్మల విజ్ఞప్తిని పరిశీలించిన కేంద్ర మంత్రి శివరాజ్
  • పామాయిల్  రైతులకు దసరా కానుక: తుమ్మల

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ముడి పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని 5.5 శాతం నుంచి 27.5  శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​కు దిగుమతి సుంకం తగ్గించడంతో పామాయిల్​ సాగుచేస్తున్న రైతులకు నష్టం వస్తున్నదని, దీంతో దిగుమతి సుంకాన్ని పెంచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. దీంతో తుమ్మల విజ్ఞప్తిని కేంద్ర మంత్రి పరిగణనలోకి తీసుకున్నారు. దిగుమతి సుంకాన్ని పెంచాలని అధికారులను ఆయన ఆదేశించారు. 

తాజా నిర్ణయం నేపథ్యంలో ముడి పామాయిల్  గెలల ధర రూ.14,392 నుంచి ఒక్కసారిగా  రూ.2,651 పెరిగి రూ.17,043 చేరుకుంది. పెరిగిన ధరలు ఈ నెల నుంచే అమలులోకి రానున్నాయి. దీంతో రైతులకు ఈ నెలలో అదనంగా రూ.12 కోట్ల  లబ్ధి చేకూరనుంది. ఇది పామాయిల్  రైతులకు దసరా కానుక  అని మంత్రి తుమ్మల మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి చౌహాన్​ చొరవ తీసుకుని ముడి పామాయిల్​ దిగుమతి సుంకాన్ని పెంచడంతో రాష్ట్రంలో కొత్తగా ఆయిల్ పామ్  వైపు సాగు వేయాలనుకునే రైతులకు అనుకూలంగా మారిందని తుమ్మల చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 44,444 ఎకరాల పామాయిల్  తోటల నుంచి సాలీన 2.80 లక్షల టన్నుల ఆయిల్ పామ్  గెలల దిగుబడి వస్తున్నదని ఆయన తెలిపారు. ఈ ధరల పెరుగుదలతో 9,366 మంది ఆయిల్ పామ్  రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్రంలో 31 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు 14 కంపెనీలకు అనుమతులు ఇచ్చామని వెల్లడించారు. రాష్ట్రంలో 2.23 లక్షల ఎకరాలను ఆయిల్ పామ్ సాగు కిందకు తీసుకువచ్చామన్నారు. పామాయిల్  సాగు చేయాలనుకునే రైతుల కోసం పామాయిల్  మొక్కలు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.