OLA విలవిల.. సీఈఓ రాజీనామా.. 10 శాతం మంది ఉద్యోగులు తొలగింపు!

ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) హేమంత్‌ భక్షి తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఏడాది జనవరిలో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. నాలుగు నెలల్లోనే ఆ పదవి నుంచి వైదొలిగారు. భక్షి రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కొత్త అవకాశాల కోసమే ఆయన సీఈఓ పదవి నుంచి వైదొలిగినట్లు ధ్రువీకరించాయి. మరోవైపు, ఓలా క్యాబ్స్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

ఓలా క్యాబ్ IPO

ఓలా క్యాబ్స్ IPO గురించి పెట్టుబడి బ్యాంకులతో చర్చలు ప్రారంభించిన కొద్దిసేపటికే ఈ ప్రకటన వెలువడింది. మరోవైపు, ఐపీఓ సన్నాహకాల్లో భాగంగా కంపెనీ..  పునర్నిర్మాణ ప్రక్రియ చేపట్టనున్నట్లు సమాచారం. దీనివలన 10 శాతం(దాదాపు 200 ఉద్యోగులు) మంది ఉద్యోగులను తొలిగించేందుకు సిద్ధమైనట్లు కథనాలు వస్తున్నాయి. కాగా, గతేడాది(FY23లో) Ola మొబిలిటీ వ్యాపారం దాదాపు 58 శాతం ఆదాయం పెరిగి రూ. 2,135 కోట్లకు చేరుకుంది.