
- ఐదుగురు అరెస్ట్
చార్మినార్, వెలుగు: డబీల్ పురా మీదుగా సంతోష్ నగర్ వెళ్తున్న ఓలా రైడర్‌ను మార్గ మధ్యలో ఆపి, బైక్, నగదు లాక్కున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. డబిల్ పురా పోలీస్ స్టేషన్ లో మలక్ పేట్ ఏసీపీ జీ. శ్యామ్ సుందర్ మీడియాతో మాట్లాడారు. యాకత్ పురా ప్రాంతానికి చెందిన మహమ్మద్ అబ్దుల్లా (22), చాదర్ ఘాట్ కు చెందిన రౌడీషీటర్ మహమ్మద్ ఆయుబ్( 29), తలపు కట్టకు చెందిన సయ్యద్ ఓమేర్ (25), రైన్ బజార్ కి చెందిన సోయల్ తో పాటు మరో ఇద్దరు నిందితులు, మరో మైనర్ బైక్ రైడర్ వద్దకు వచ్చి బెదిరించారు.
అనంతరం అతని జేబులో ఉన్న రూ.5వేలను , ఏటీఎం కార్డును లాక్కున్నారు. పిన్ నెంబర్ చెప్పాలంటూ దాడి చేశారు. బైక్ రైడర్ పిన్ నెంబర్ చెప్పిన తర్వాత ఏటీఎం సెంటర్ కు వెళ్లి మరో మూడు వేలను డ్రా చేసుకున్నారు. మళ్లీ వచ్చి బాధితుడిని చితకబాధారు, యాక్టివా బైక్‌ను, సెల్ ఫొన్ తీసుకొని పారిపోయారు. బాధితుడు ఈనెల 11న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 వేల నగదు తో పాటు సెల్ ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.