త్వరలోనే ఓలా చిప్​లు

త్వరలోనే ఓలా చిప్​లు
  • 2026లో మనదేశంలోనే తయారైన చిప్ ను తెస్తామని వెల్లడి
  • సీపీయూ, మొబైల్స్, బండ్లలో వాడే చిప్ ల తయారీలోకీ ఓలా కృత్రిమ్ 

కృష్ణగిరి  నుంచి వెలుగు ప్రతినిధి: ఏఐ ఫ్లాట్ ఫామ్ కృత్రిమ్ 2026 నాటికి మొదటి ఏఐ చిప్ ను తీసుకొస్తుందని ఓలా తెలిపింది. బోధి పేరుతో దీనిని తీసుకువస్తామని  ‘సంకల్ప్ 2024’ పేరుతో తమిళనాడులోని కృష్ణగిరి ప్లాంటులో నిర్వహించిన కార్యక్రమంలో  ప్రకటించింది.

డిజైన్ , ప్రొడక్షన్​ను ఓలా చూసుకోనుండగా, ఇందుకోసం టెక్ కంపెనీలు ఆర్మ్ , అన్టెతర్ ఏఐతో స్ట్రాటజిక్ పార్టనర్షిప్ కుదుర్చుకుంది. బోధితో పాటు సీపీయూల్లో వాడే చిప్ ను సర్వ్ పేరుతో, మొబైల్ ఫోన్లు, బండ్లలో వాడే చిప్ ను ఓజాస్ పేరుతో మార్కెట్ లోకి కృత్రిమ్ తీసుకురానుంది. ఏఐ సిస్టమ్ లో వాడే అడ్వాన్స్డ్ చిప్ ను బోధి 2 పేరుతో 2028 నాటికి లాంచ్ చేస్తామని ప్రకటించింది.

వీటితో పాటు కృత్రిమ్ డేటా సెంటర్లను నిర్మించనుంది. డేటా సెంటర్ కేపాసిటీని 2028 నాటికి ఒక గిగా వాట్ కు పెంచుతామని ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్ అన్నారు.  కృత్రిమ్ క్లౌడ్ ను మరింతగా విస్తరిస్తామని పేర్కొన్నారు. ఏఐ స్టూడియో, లాంగ్వేజ్ హబ్ వంటి 50 కి పైగా డెవలపర్లకు ఉపయోగపడే క్లౌడ్ సర్వీసులను కృత్రిమ్ క్లౌడ్ లో అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ ఏడాది దీపావళి వరకు రూ. 100 కోట్ల విలువైన ఈ సర్వీసులను ఫ్రీగా యూజర్లకు ఓలా అందిస్తోంది. ఓఎన్ డీసీ యూజర్లకు ఏడాది పాటు ఫ్రీగా అందించనుంది. 

ఓలా బ్యాటరీ సెల్ 'భారత్ ' ..

బ్యాటరీల్లో వాడే సెల్ ను భారత్ పేరుతో ఓలా లాంచ్ చేసింది.  ఏడాదిలోనే వీటి తయారీ ప్లాంట్  అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ ప్లాంట్ కెపాసిటీ 1.5 గిగా వాట్ అవర్ కాగా, ఈ ఏడాది చివరి నాటికి 5 గిగా వాట్ అవర్ కు, 2026 నాటికి 20 గిగావాట్ అవర్​కు పెంచుతామని పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్ - జూన్ క్వార్టర్ లో పూర్తిగా భారత్ సెల్ తో తయారైన బ్యాటరీతో ఓలా టూ వీలర్లను మార్కెట్ లోకి తెస్తామని ప్రకటించింది.

సంకల్ప్ 2024 - ఓలా  వార్షిక లాంచ్ ఈవెంట్‌లో ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ, ప్రస్తుతం భారతదేశ టూవీలర్ల మార్కెట్‌లో మూడింట రెండు వంతుల మోటార్‌సైకిళ్లే ఉన్నాయని, తమ కంపెనీ ఈ విభాగంలోకి ప్రవేశించడం తప్పనిసరి అని అన్నారు. "స్కూటర్ సెగ్మెంట్‌లో ఈవీల వాడకాన్ని వేగవంతం చేయడంలో  ఇప్పటికే విజయవంతమయ్యాం.   ఇప్పుడు మా మోటార్‌సైకిళ్ల ద్వారా ఈవీ వ్యాప్తిని మరింత పెంచుతాం”అని ఆయన చెప్పారు.

ఓలా నుంచి బైక్ లు..

ఓలా తన రోడ్ స్టర్ మోడల్లో మూడు ఎలక్ట్రిక్ బైక్ లను గురువారం లాంచ్ చేసింది. రోడ్ స్టర్ ప్రో, రోడ్ స్టర్ , రోడ్ స్టర్ ఎక్స్ కోసం బుకింగ్స్ చేసుకోవచ్చు. రోడ్ స్టర్ ప్రో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండగా ధర రూ. 2 లక్షల నుంచి మొదలవుతోంది.

రోడ్ స్టర్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండగా ధర రూ. 1,05,000 నుంచి, రోడ్ స్టర్ ఎక్స్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండగా, ధర రూ. 75 వేల నుంచి మొదలవుతోంది. రోడ్ స్టర్ , రోడ్ స్టర్ ఎక్స్ బండ్ల డెలివరీ వచ్చే ఏడాది జనవరి నుంచి, రోడ్ స్టర్ ప్రో డెలివరీ వచ్చే ఏడాది దీపావళి నుంచి ఉంటాయి. వీటితో పాటు టూ వీలర్లలో వాడే సాఫ్ట్​వేర్ ను ఓలా అప్ డేట్ చేయనుంది. మూవ్ ఓఎస్ 5 బీటా వెర్షన్ ను ఈ ఏడాది దీపావళి నాడు లాంచ్ చేయనుంది.