
హైదరాబాద్: గచ్చిబౌలి స్టేడియం వద్ద 200 మంది ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. గతంలో కిలోమీటర్‌కి 18 నుంచి 20 రూపాయలు చెల్లించే ఓలా, ఉబర్ కంపెనీలు..ఇప్పుడు కిలో మీటర్‌కి 6 నుంచి 9 రూపాయలే ఇస్తున్నాయని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మాకు వచ్చిన డబ్బుల్లో కంపెనీలే 30 శాతం కమిషన్ తీసుకుంటున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఇంతకుముందు గచ్చిబౌలి నుండి ఎయిర్పోర్ట్ వెళితే రూ.600 ఇచ్చిన కంపెనీలు.. ప్రస్తుతం 300 నుంచి 350 రూపాయలే ఇస్తున్నారని వాపోయారు.
30 కిలోమీటర్లకు 350 రూపాయలు సరిపోవటం లేదని.. పాత తరహాలోనే కిలోమీటర్‌కి 18 నుంచి 20 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల వాహనాలు ఇక్కడ ఓలా, ఉబర్లలో పెట్టడంతో మాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. మాదాపూర్ నుండి ఎయిర్పోర్ట్ వెళితే కస్టమర్ దగ్గర నుంచి 850 రూపాయలు వసూలు చేస్తున్న ఓలా, ఉబర్ కంపెనీలు.. మాకు మాత్రం అదే ట్రిప్పుకు 450 రూపాయలు చెల్లిస్తున్నాయని తెలిపారు.
ALSO READ | మెట్రో రైళ్లపై రాత్రికే బెట్టింగ్ యాప్ యాడ్స్ తొలగిస్తాం: ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
ఓలా, ఉబర్ కంపెనీలు ఒక ట్రిప్పుపై 400 రూపాయలు కమిషన్ తీసుకుంటున్నాయని.. మాకు ఇచ్చే400 రూపాయలలో కూడా 5 శాతం జీఎస్టీ పేరుతో కంపెనీలు కట్ చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు డ్రైవర్లు. కొందరు ఏపీ వాహనాలను నంబర్ ప్లేట్లు మార్చి ఓలా, ఉబర్లలో నడుపుతున్నారని.. నంబర్ ప్లేట్లు మార్చి వాహనాలు నడుపుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓలా, ఉబెర్ కంపెనీలు తమ సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్ల ఆందోళన నేపథ్యంలో గచ్చిబౌలిలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.