గద్వాల, వెలుగు: గద్వాల కాంగ్రెస్ లో పాత, కొత్త కాంగ్రెస్ లీడర్లు సర్దుకుపోతలేరు. పార్టీలో టికెట్ల లొల్లి మరోసారి వెలుగులోకి వచ్చింది. టికెట్ తమకే వస్తుందని తమను ఆశీర్వదించాలని జడ్పీ చైర్పర్సన్ సరిత అనడంతో. పాత కాంగ్రెస్ లీడర్లు అభ్యంతరం తెలిపారు. తాడోపేడో హైకమాండ్‌తోనే తేల్చుకుంటామంటూ పాత కాంగ్రెస్ లీడర్లు డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ వెళ్లి స్టీరింగ్ కమిటీ చైర్మన్ మురళీధర్‌కు కంప్లైంట్ చేశారు. దీంతో గాంధీభవన్ నుంచి మధ్యాహ్నం జడ్పీ చైర్పర్సన్ వర్గానికి హైదరాబాద్ రావాలని పిలుపువచ్చింది. హుటాహుటిన జడ్పీ చైర్పర్సన్ వర్గీయులు హైదరాబాద్ కి తరలి వెళ్లారు. మల్దకల్, గద్వాల, గట్టు మండలాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
శని, ఆదివారాల్లో జరిగిన ప్రోగ్రామ్ లలో జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ‘ఒక ఆడబిడ్డగా వచ్చాను.. తనను ఆశీర్వదించండి’ అని చెప్పడంతో టికెట్ ఆశిస్తున్న వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజుల కింద ఇటీవల పార్టీలో చేరిన ఒక లీడర్ తో పాత కాంగ్రెస్ లీడర్ కు వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు సెల్ ఫోన్లు విసురుకున్నారనే టాక్ పార్టీలో నడుస్తోంది. ఆ ఘటన మరవక ముందే టికెట్ లొల్లిపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేయడంపై కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.